Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురికి గాయాలు
- కాకినాడలోని 'ఐడియల్'ను ఎయిడెడ్‌లోనే కొనసాగించాలని ధర్నా
కాకినాడ : కాకినాడలోని ఐడియల్ విద్యా సంస్థలను ఎయిడెడ్‌లోనే కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో, ఐదుగురికి గాయాలయ్యాయి. ఐడియల్ కళాశాలకు ప్రభుత్వ ఎయిడెడ్‌ను నిలుపుదల చేయాడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం కళాశాల ఎదుట ధర్నా చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ నినదించారు. అనంతరం కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు బారికేడ్లు, మెయిన్ గేటును తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. లాఠీలతో బాదుతూ అందరినీ బయటకు తరిమేశారు. ఈ సమయంలో పలువురు కిందపడిపోయారు. లాఠీఛార్జిలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎం.సూరిబాబు చేతివేళ్లకు రక్తం వచ్చేలా గాయమైంది. ఐడియల్ కళాశాల విద్యార్థినులు దివ్యతనూజ, ఆర్.అనూష, ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ లోవతల్లి, సిటీ సహాయ కార్యదర్శి మణికంఠకు గాయాలయ్యాయి. అనంతరం కాకినాడ డిఎస్పి భీమారావు, డిఆర్‌ఒ సత్తిబాబు విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. స్పష్టమైన హామీ వచ్చేవరకూ ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. దీంతో, విద్యార్థులతో గంటపాటు డిఎస్పి చర్చించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హమీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. గాయపడిన విద్యార్థులు కాకినాడ జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ వర్షంలోనే విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
లాఠీఛార్జి తగదు : ఎమ్మెల్సీ ఐవి
ఎయిడ్‌ను కొనసాగించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఖండించారు. విద్యార్థులపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తోన్న మార్పులు పేద విద్యార్థులకు చదువును దూరం చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని ధర్నా
ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబర్ 35, 42, 55లను వెంటనే రద్దు చేసి, ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ గుణదలలోని బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్.కోటబాబు, ఎం.సోమేశ్వరరావు మాట్లాడారు.
పోరాట విజయం
ఎస్ఎస్బిఎన్ విద్యాసంస్థలను గ్రాంట్ ఇన్ ఎయిడ్లోనే కొనసాగించాలని నిర్ణయంఅనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ విద్యా సంస్థలను ఎయిడెడ్‌లోనే కొనసాగాలని తీర్మానించారు. శుక్రవారం జరిగిన ఆ విద్యా సంస్థల జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలోనే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కొనసాగాలని సభ్యులందరూ నిర్ణయించినట్టు కరస్పాండెంట్ పిఎల్ఎన్.రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, గత సోమవారం నుంచి విద్యార్థులు చేపట్టిన పోరాటం విజయవంతమైంది.