Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కారణంగా 90శాతం కుటుంబాల ఆదాయాలపై దెబ్బ
- లిర్నేఏసియా, ఐసిఆర్ఐఈఆర్ నివేదిక
న్యూఢిల్లీ : లాక్డౌన్ సమయంలో 80 శాతం పిల్లలకు విద్య అందలేదని లిర్నేఏసియా, ఐసిఆర్ఐఈఆర్ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 36 శాతం కుటుంబాలకు ఇంటర్నెట్ సదుపాయం లేదని, ఇంటర్నెట్ ఉన్న కుటుంబాల్లో పిల్లలకు ఆన్లైన్ విద్య అంతంత మాత్రమేనని పేర్కొంది. అలాగే కరోనా లాక్డౌన్లో 90 శాతం కుటుంబాల్లో ఆదాయాలు పడిపోయాయని స్పష్టం చేసింది. ఈమేరకు లిర్నేఏసియా, ఐసిఆర్ఐఈఆర్ సంస్థ ''డిజిటల్ ఇండియా''లో కరోనా సమయంలో సేవలు పేరుతో రిపోర్టు విడుదల చేసింది. దేశంలో కరోనాకు ముందు స్కూల్స్లో ఉన్న వారిలో కేవలం 20 శాతం మంది చిన్నారులకి( 5-18 ఏళ్ల మధ్య చిన్నారులు) మాత్రమే పాఠశాలల మూసివేత సమయంలో విద్య అందింది. కరోనా కాలంలో 80 శాతం మంది పిల్లలకు విద్య అందలేదు. 22 శాతం బాలికలు, 19 శాతం బాలురు ఆన్లైన్ విద్యను అందుకున్నారు. అలాగే పట్టణాల్లో 27 శాతం, గ్రామాల్లో 18 శాతం ఆన్లైన్ విద్యను పొందగలిగారు.
అనూహ్యంగా పెరిగిన స్మార్ట్ఫోన్ వాడకం
దేశంలో 2021 ఆగస్టు నాటికి ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య 47.3 కోట్లకు పెరిగింది. పురుషులు, పట్టణ ప్రాంతాల వారు, ఉద్యోగులు, ధనికులు, యువత, విద్యావంతులు ఎక్కువగా నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడుతున్నవారిలో 57శాతం పురుషులు, 36శాతం మహిళలున్నారు. గత నాలుగేళ్లలో స్మార్ట్ ఫోన్ ఉపయోగిం చేవారు 40 శాతం పెరిగారు. 2021 నాటికి బేసిక్ ఫోన్స్ వాడకం 26 శాతం, ఫీచర్ ఫోన్స్ వాడకం 6 శాతం, స్మార్ట్ ఫోన్స్ వాడకం 68 శాతంగా ఉంది.
కుటుంబ ఆదాయం డౌన్
అత్యంత కఠినమైన లాక్డౌన్ కారణంగా 90 శాతం కుటుంబాల్లో ఆదాయాలు పడిపోయాయి. అందులో 59 శాతం కుటుంబాల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. లాక్డౌన్ సడలించిన తర్వాతా..60శాతం కుటుంబాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. 31 శాతం కుటుంబాల ఆదాయం స్వల్పంగా తగ్గింది. పేద కుటుంబాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు 74 శాతం కుటుంబాల ఆదాయాలు కరోనాకు ముందునాటి కంటే తక్కువగా ఉన్నాయి.