Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ, పరిసర ప్రాంతాలను వారం రోజుల నుంచి పొగ మంచు దుప్పటిలా కమ్మేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీర్ఘకాలిక చర్యల కన్నా అత్యవసర ప్రణాళికకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. 'పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో చూస్తున్నాం. చివరకు ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తుంది' అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రణాళిక ఏమిటో సోమవారంలోగా తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 'అత్యవసర చర్యలేమి తీసుకుంటారో చెప్పండి.. రెండు రోజులపాటు లాక్డౌన్ విధిస్తారా? వాయు నాణ్యత సూచి స్థాయిలను తగ్గించడానికి మీ ప్రణాళిక ఏమిటి?' అని ప్రశ్నించారు. వాయు కాలుష్యంపై పంజాబ్, హర్యానాలతో భేటీకానున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతల పరిధిని దాటి సమస్యను పరిశీలించాలని, ఏదో ఒకటి చేయాలని, దాంతో రెండు మూడు రోజులైనా ప్రశాంతంగా ఉంటామని ఎన్వి రమణ అన్నారు. ఢిల్లీలోని గాలిని పీల్చడమంటే... రోజుకు 20 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అంగీకరించింది. పరిస్థితి తీవ్రతను అంగీకరిస్తున్నామని తెలిపింది.
పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధమే కారణమన్న కేంద్రంపై న్యాయమూర్తుల ఆగ్రహం
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమని సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం, దీన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... 'రైతులు పంట వ్యర్థాలను తగుల బెట్టడం వల్ల కొంతమేర మాత్రమే కాలుష్యం ఏర్పడుతుంది. మిగిలిన వాటి గురించి ఏమిటి? ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రణాళిక ఏమిటో చెప్పండి' అని ప్రశ్నించింది. రైతులకు ప్రోత్సాహకం అందకపోతే మార్పు వచ్చే అవకాశం లేదని జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. సబ్సిడీ ఉన్నా రైతులు వ్యర్థాలను తగులబెట్టే యంత్రాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. రైతులను తిట్టడం ప్రతిసారి ఫ్యాషన్‌గా మారిందని, కేంద్రం టపాసులు బ్యాన్ చేసినప్పటికీ.. 5-6 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలిసిందేనని జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రైతులు మాత్రమే అని చెప్పడం లేదని, అలా తాము ఎప్పుడూ చెప్పలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు
వారం రోజులపాటు పాఠశాలల మూత
ఇంటినుంచే ప్రభుత్వ అధికారుల పని : ఢిల్లీ సిఎం
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. అత్యవసర సమావేశం అనంతరం శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి వారం రోజులపాటు పాఠశాలలను మూసివేస్తామని చెప్పారు. ఈ నెల 14 నుంచి 17 వరకూ ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తామని, ప్రైవేటు కార్యాలయాలకు కూడా సలహా ఇస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు కూడా పంట వ్యర్థాలు తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు.