Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడిచేశారు. అసోం రైఫిల్స్ జవాన్ల కాన్వారును లక్ష్యంగా చేసుకుని ముష్కరులు మెరుపుదాడికి పాల్పడ్డారు. చురచంద్‌పూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు, జవాన్లు కలిపి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే మరిన్ని భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడిలో అధికారి త్రిపాఠి భార్య, కుమారుడు అక్కడికక్కడే చనిపోయారు. అధికారిక నివేదికల ప్రకారం, 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ త్రిపాఠి నవంబర్ 12, శుక్రవారం తన బెహియాంగ్ కోరు పోస్ట్‌ను సందర్శించి, రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. బెహియాంగ్ పోలీస్ స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని బెహియాంగ్ సమీపంలో శనివారం ఉదయం 10 గంటలకు ఆకస్మిక దాడి జరిగినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మణిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడి వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇదిలావుండగా, కాశ్మీర్ లోయలో క్రియాశీలంగా ఉన్న 38 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించాయనీ, వారిని మట్టుబెట్టేందుకు త్వరలో సమన్వయంతో కూడిన ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని బలగాలు ప్రకటించిన తర్వాతి రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.