Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర చర్చకు తెరలేపిన మద్రాస్ హైకోర్టు సీజే బదిలీ
- సుప్రీం కొలీజియం సిఫార్సులపై న్యాయవాదులు ఆగ్రహం
- జస్టిస్ సంజీవ్ బెనర్జీని ఇక్కడే ఉంచాలంటూ 200 మందికి పైగా న్యాయవాదులు లేఖ
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, ఆరోగ్య హక్కు, ప్రభుత్వాల జవాబుదారీతనం వంటి అంశాలపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీని.. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు బదిలీ చేయాలనే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. సీజేను బదిలీ చేయాలన్న కోలీజియం సిఫార్సుపై మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు నిరసన.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణతో పాటు కొలీజియం సభ్యులకు 200 మందికి పైగా న్యాయవాదులు సంయుక్తంగా లేఖ రాశారు. ''పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?'' అంటూ తమ లేఖలో ప్రశ్నించారు. 75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించే ప్రశ్నలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఏడాదిలో 35 వేలకు పైగా కేసులు దాఖలయ్యే హైకోర్టులో సమర్థవంతమైన, నిర్భయం కార్యనిర్వాహకుడిగా పేరొందిన న్యాయమూర్తిని నెలకు 70 నుంచి 75 కేసులు నమోదయ్యే హైకోర్టుకు ఎందుకు బదిలీ చేస్తున్నారో తెలుసుకోవడం తమ హక్కుగా న్యాయవాదులు పేర్కొన్నారు. తమిళనాడులో న్యాయవ్యవస్థలో అవినీతిని అరికట్టడానికి, పూర్తి స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను నిర్ధారించడానికి జస్టిస్ బెనర్జీ హయాంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసని వారు తెలిపారు. అవినీతి, అసమర్థత పట్ల ఆయన ఆగ్రహం ప్రశంసించబడిందని న్యాయవాదులు గుర్తు చేశారు. 'రాష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలను ఈ బదిలీ అణిచివేస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, జస్టిస్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలనే నిర్ణయాన్ని కొలీజియం పున:పరిశీలించాలని అభ్యర్థిస్తున్నాము' అని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు బదిలీ చేశారని సుప్రీంకోర్టు కొలీజియంను న్యాయవాదులు ప్రశ్నించారు.
కాగా, సెప్టెంబరు 16న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం జస్టిస్ బెనర్జీని మేఘాలయకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ఈ నెల 9న రాష్ట్రపతి ఈ సిఫార్సుకు ఆమోదం తెలిపారు. ఇదిలావుండగా, మద్రాస్ హైకోర్టు సీజేగా పది నెలలే బాధ్యతల్లో ఉన్నా జస్టిస్ సంజీబ్ బెనర్జీ... కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానం, ఆక్సిజన్ కొరతపై విమర్శలు చేశారు. మీడియా, ఐటీ చట్టాన్ని నియంత్రించడానికి కేంద్రం రూపొందించిన నిఘా వ్యవస్థపైనా న్యాయమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఆధార్ డేటాను బీజేపీ దుర్వినియోగం చేసిందని కూడా ఆయన ఆరోపణలు చేశారు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు, వాటి స్వతంత్ర గురించి కూడా పలుమార్లు ప్రస్తావించారు. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘంపై హత్యానేరం మోపాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది జస్టిస్ సంజీవ్ బెనర్జీతో కూడిన ధర్మాసనమే. ప్రస్తుతం ఆయా అంశాలు, బదిలీ అంశాలు.. గతంలో మద్రాస్ హైకోర్టు సీజేగా విజయ కె. తాహిల్రమణిని కూడా మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడం.. నిరసనగా రాజీనమా చేస్తే వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలుపడం వంటివి సరికొత్త చర్చనీయ అంశాలుగా మారాయి.