Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ పురుషుల్లో 13.8శాతం, మహిళల్లో 10.3శాతం
- పట్టణ పురుషుల్లో 18.2శాతం, మహిళల్లో 24.9శాతం
- నేషనల్ శాంపిల్ సర్వే రిపోర్టు
న్యూఢిల్లీ : దేశంలో 15-29 ఏళ్ల వయస్సు గల యువతలో నిరుద్యోగ రేటు 15శాతంగా ఉన్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) పేర్కొంది. ఈ మేరకు కేంద్ర స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎన్ఎస్ఎస్ డేటా ఫర్ డవలప్మెంట్ కింద సర్వేక్షణ పేరుతో నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో పురుషుల్లో నిరుద్యోగ రేటు 13.8శాతం కాగా, మహిళల్లో 10.3శాతం ఉంది. పట్టణాల్లో పురుషుల్లో 18.2శాతం, మహిళల్లో 24.9శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. అలాగే 15 ఏండ్లు దాటిన చదువుకున్న వారిలో నిరుద్యోగ రేటు 10.1శాతంగా ఉంది. గ్రామాల్లో 9.9 శాతం కాగా, పట్టణాల్లో 10.3శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. దేశంలో అన్ని వయస్సు గల వారిలో నిరుద్యోగ రేటు 4.8 శాతం కాగా, అందులో గ్రామాల్లోని పురుషుల్లో 4.5శాతం, మహిళల్లో 2.6శాతం ఉంది. పట్టణాల్లో పురుషుల్లో 6.4 శాతం, మహిళల్లో 8.9 శాతం నమోదు అయింది. గ్రామాల్లో 11.9 గంటల నుంచి 14.2 గంటల పాటు అదనపు పని చేస్తున్నారనీ, పట్టణాల్లో 11.7 గంటల నుంచి 18.8 గంటల అదనపు పని చేస్తున్నారని తెలిపింది. గ్రామాల్లో వారానికి 39 నుంచి 46 గంటల పని చేస్తున్నారనీ, అదే పట్టణాల్లో 30 నుంచి 54 గంటల చేస్తున్నారని తెలిపింది. స్వయం ఉపాధి పొందిన కార్మికులు స్వయం ఉపాధి పనుల ద్వారా 30 రోజుల్లో సగటు స్థూల ఆదాయాలు గ్రామాల్లోని పురుషుల్లో రూ.9.2 వేలు నుంచి రూ.10.1 వేలు కాగా, మహిళల్లో రూ.4.6 వేలు నుంచి రూ.5 వేలు ఉందని తెలిపింది. పట్టణాల్లో పురుషుల్లో రూ.14.5 వేలు నుంచి రూ.17.8 వేలు కాగా, మహిళల్లో రూ.6.9 వేల నుంచి రూ. 7.7 వేలు పొందుతున్నారు. సాధారణ కార్మికులు రోజుకు సగటు వేతనం గ్రామాల్లో పురుషులకు రూ.297 నుంచి రూ.315 రాగా, మహిళలకు రూ.185 నుంచి రూ.209 వరకు వస్తుంది. పట్టణాల్లో పురుషులకు రూ.375 నుంచి రూ.391 రాగా, మహిళలకు రూ.243 నుంచి రూ.265 వస్తుంది.
వ్యవసాయం రంగంలో..
గ్రామాల్లో వ్యవసాయరంగంలో 61.5 శాతం పని చేయగా, అందులో 55.4 శాతం పురుషులు, 75.7 శాతం మహిళలు పని చేస్తున్నారు. నిర్మాణ రంగంలో 12.2 శాతం పని చేయగా, అందులో పురుషులు 15 శాతం కాగా, మహిళలు 5.6 శాతం ఉన్నారు. ఉత్పత్తి రంగంలో 7.3 శాతం మంది పని చేయగా, అందులో పురుషులు, మహిళలు సమానంగానే ఉన్నారు. వ్యాపారం, హౌటల్, రెస్టారెంట్ రంగంలో 7.6 శాతం పని చేయగా, అందులో 9.2 శాతం పురుషులు, 3.7 శాతం మహిళలున్నారు. స్వయం ఉపాధి పొందిన వారు గ్రామాల్లోని పురుషుల్లో 58.4 శాతం కాగా, మహిళల్లో 63 శాతమున్నారు. పట్టణాల్లో పురుషుల్లో 38.7శాతం కాగా, మహిళలు 34.6శాతం ఉన్నారు. కార్మిక జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) 38.2 శాతం ఉంది. అందులో గ్రామాల్లో పురుషులు 53.8 శాతం కాగా, మహిళలు 24 శాతం ఉన్నారు. పట్టణాల్లో 54.1 శాతం పురుషులు కాగా, 16.8 శాతం మహిళలు ఉన్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్ఎఫ్పిఆర్) దేశంలో 40.1 శాతం ఉంది. గ్రామాల్లో పురుషులు 56.3 శాతం, మహిళలు 24.7 శాతం ఉన్నారు. పట్టణాల్లో పురుషులు 57.8 శాతం, మహిళలు 18.5 శాతం ఉంది.