Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రబీలో రైతన్నలకు లభ్యత కరువు...
- వ్యవసాయ మంత్రి సొంత రాష్ట్రం ఎంపీ లోనూ ఇదే పరిస్థితి
- ఇలా అయితే దేశంలో ఆహార కొరత ప్రమాదం : నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రబీ సీజన్లో అన్నదాతలు పంటలు వేయడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈ పంటలకు అత్యంత అవసరమైన రసాయనిక ఎరువు డై-అమ్మోనియమ్ పాస్పెట్ (డీఏపీ) కొరత మాత్రం వారిని ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రస్తుతం దేశంలో డీఏపీ లభ్యత అత్యంత కష్టంగా మారింది. దీంతో దీని ప్రభావం రబీలో రైతులు వేసే పంటలపై పడనున్నది. ఒకవేళ దేశంలోని రైతులు నవంబర్ 15కు ముందు రబీ పంటలు వేయకపోతే, వచ్చే ఏప్రిల్‌లో దేశంలో పంట ఉత్పత్తి తీవ్రంగా పడిపోయే అవకాశం ఉన్నది. ఫలితంగా దేశంలో ఆహార కొరత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరించారు.
డీఏపీ కోసం రైతన్నల పడిగాపులు
ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డీఏపీ కొరత క్రమంగా పెరుగుతున్నది. రాజస్థాన్‌కు అవసరమైన డీఏపీ కంటే 50 శాతం తక్కువ నవంబర్ ప్రారంభం నాటికి అందడం గమనార్హం. ఈ పరిస్థితి ఇక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. డీఏపీ కోసం ఇక్కడి రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగను కూడా జరుపుకోకుండా వారు కో-ఆపరేటివ్ సొసైటీల ముందు భారీ క్యూల్లో డీఏపీ కోసం నిలుచున్న సందర్భాలూ ఉన్నాయి. సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని రైతులూ డీఏపీ కొరతతో ఇబ్బందులు పడుతుండటం గమనార్హం.
అన్నదాతల ఆందోళనలు
కాగా, కొరత విషయంలో దేశవ్యాప్తంగా రైతన్నలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ మంత్రుల ఇండ్లను ఘెరావ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆందోళనల్లో భాగంగా రోడ్లను నిర్బంధించారు. తమ నిరసనను హింసాత్మకంగా అడ్డుకునే యత్నం చేసిన పోలీసు చర్యలనూ అన్నదాతలు ఎదుర్కొన్నారు. ఇక మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డీఏపీ దోపిడీ ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక కొన్ని చోట్లల్లో సప్లయర్లు డీఏపీని కృత్రిమ కొరతను సృష్టించినట్టు వార్తలూ వచ్చాయి. ఈ విధంగా డీఏపీ లభ్యత కష్టంగా మారడంతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు గుండెపోటుతో మరణించిన సందర్భాలూ ఉన్నాయి. కాగా, డీఏపీ కష్టాలు ఏర్పడటంతో రైతన్నలు దాని స్థానంలో ఎన్పీకేను వాడారు. అయితే, ఇది తీవ్ర ఖర్చుతో కూడినది కావడంతో రైతన్నలపై ఆర్థిక భారం పడుతుంది.
'కొరత ఒక కుట్ర'.. రైతు నాయకుల ఆగ్రహం
రసాయనిక ఎరువు కొరత విషయంలో పలు రాజకీయ పార్టీలు అన్నదాతలకు అండగా నిలిచాయి. కొరతను ఒక '' కుట్ర''గా అభివర్ణించాయి. డీఏపీ సప్లరులను వెంటనే విడుదల చేయాలని మోడీ సర్కారును డిమాండ్ చేశాయి. కాగా, డీఏపీ ధరల పెరుగుదల అనేది '' కార్పొరేటు మానిప్యులేషన్'' అని బీకేయూ కు చెందిన రైతు నాయకుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ తెలిపారు. పంజాబ్, హర్యానాల్లో కొరత అనేది రాజకీయ ప్రేరేపిత చర్య అంటూ మరికొందరు అభివర్ణించారు.
ఆకాశాన్నంటిన డీఏపీ ధరలు
ఖరీఫ్ సీజన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్‌లో ఒక టన్నుకు ఇది 700 డాలర్లను చేరుకున్నది. అయితే, గతేడాది ఇదే సమయంలో దీని ధర 434 డాలర్లుగా ఉండటం గమనార్హం. అయితే, దేశీయంగా ధరలను నియంత్రించడానికి మోడీ సర్కారు కంపెనీలకు అదనంగా సబ్సీడీలు ప్రకటించినప్పటికీ అది ఏమాత్రమూ ఫలితాన్ని ఇవ్వలేదు.
చైనాతో వ్యాపార ఆంక్షలతోనూ ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా డీఏపీని ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా ఒకటి. అయితే, చైనాతో సరిహద్దు వివాదం, తదనంతరం ఆ దేశంతో వాణిజ్యం విషయంలో భారత్ విధించిన ఆంక్షలూ రైతులకు శాపంగా మారాయి. దీంతో చైనా నుంచి భారత్‌కు వచ్చే ఈ ఫర్టిలైజర్‌కు ఆటంకం ఏర్పడింది. దేశంలోని కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే బదులు.. ఫెర్టిలైజర్, దాని ముడి పదార్థాలకు అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్న కెనడా, రష్యా, చైనా, ఆఫ్రికాలోని పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను భారత ప్రభుత్వం చేసుకోవాలని నిపుణులు సూచించారు. కాగా, మోడీ సర్కారు అప్రమత్తమై డీఏపీ ని రైతులకు విరివిగా తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చూడాలని తెలిపారు. లేకపోతే, కొన్ని నెలల్లో పంట దిగుబడి పడిపోయే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరించారు.