Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ ొ26మంది మావోయిస్టులు మృతి
- మృతుల్లో మిలింద్ తేల్తుంబ్డే!
- నలుగురు జవాన్లకు గాయాలు : గడ్చిరోలి ఎస్పీ
ముంబయి : మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. గారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 26మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే ('బీమా కోరోగావ్' కేసులో అరెస్టయిన ఆనంద్ తేల్తుంబ్డే సోదరుడు) చనిపోయిన మావోయిస్టుల్లో ఉన్నాడని నిఘా వర్గాలు అంచనావేస్తున్నాయి. గడ్చిరోలి పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నదాని ప్రకారం, శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు జరిగిన అత్యంత సుదీర్ఘమైన ఎన్కౌంటర్లో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. చనిపోయిన మావోయిస్టుల భౌతికకాయాల్ని గుర్తించామని, వీరు ఎవరెవరు? అన్నది ఆదివారం తెలియజేస్తామని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ విలేకర్లకు తెలిపారు. ఎదురుకాల్పుల్లో నలుగరు జవాన్లకు కూడా గాయాలయ్యాయని అన్నారు. నాగపూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ సంఘటన జరిగినట్టు చెప్పారు. గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్‌కు చెందిన సి-60 ఫోర్స్ జవాన్లు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, వెంటనే జవాన్లు ప్రతిస్పందించారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. పోలీస్ నిఘా వర్గాల సమాచారంతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ మొదలైందని, ఈ ఆపరేషన్‌లో 500మందితో కూడిన సి-60 కమాండోలు పాల్గొన్నారని తెలిసింది. గడ్చిరోలి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్కౌంటర్లో 26మంది మావోయిస్టులు మరణించారు. సంఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలను పంపినట్టు తెలిపారు. మర్దింటొల అడవిలో గాలింపు జరుపుతున్నామని తెలిపారు. మృతదేహాలను గడ్చిరోలి తరలించి, పోస్ట్‌మార్టంకు పంపిస్తామని చెప్పారు.
సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. చికిత్స కోసం వీరిని హెలికాప్టర్ ద్వారా నాగపూర్ తరలించామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా జల్లెడ పడుతున్నారు.