Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఏడు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి : ఫైనాన్స్ సెక్రెటరీ టీవీ సోమనాథన్
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో మూలధన వ్యయం లక్ష్యాలు చేరుకోవడంపై అదనంగా రూ. 16,691 కోట్లను రుణంగా తీసుకోవడానికి ఏడు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ సెక్రెటరీ టీవీ సోమనాథన్ తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం మూలధనంలో జులై-సెప్టెంబర్ నాటికి ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు 45 శాతం లక్ష్యాన్ని సాధించాయి. 2021-22లో స్థూల రాష్ట్ర అభివృద్ధి ఉత్పత్తి (జీఎస్డీపీ)లో నాలుగుశాతం నికర రుణ పరిమితిలో.. జీఎస్డీపీలో 0.50 శాతం వరకు రుణాలు పెరుగుతున్న మూలధన వ్యయం (క్యాపెక్స్) కోసం కేటాయించబడ్డాయి. అన్ని రాష్ట్రాలకూ రూ. 5.79 లక్షల కోట్లు క్యాపెక్స్ లక్ష్యంగా నిర్దేశించబడింది. ఒకవేళ మూల ధన ఖర్చు ఈ లక్ష్యాన్ని మించితే అనుమతించిన రుణ పరిమితి రూ. 8.46 లక్షల కోట్ల కంటే ఆ రాష్ట్రాలు అదనంగా రూ. 1. 05 లక్షల కోట్లు తీసుకోవడానికి అర్హతను కలిగి ఉంటాయి. తొలి త్రైమాసికం ముగింపు నాటికి ఈ ఏడాదిలో కనీసం 15 శాతం లక్ష్యాన్ని, రెండో త్రైమాసికం ముగింపు నాటికి 45 శాతం, మూడో త్రైమాసికం నాటికి 70 శాతం, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వంద శాతం లక్ష్యాన్ని రాష్ట్రాలు సాధించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం.. రాష్ట్రాల క్యాపెక్స్ రివ్యూను జరిపింది. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కేంద్రం 11 రాష్ట్రాలకు అదనంగా రూ. 15,721 కోట్లు రుణానికి అనుమతులిచ్చింది. అలాగే, రెండు రౌండ్ల క్యాపెక్స్ రివ్యూ అనంతరం రూ. 32,512 కోట్ల అదనపు రుణం కోసం రాష్ట్రాలకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. కాగా, ఏప్రిల్-డిసెంబర్ మధ్య రాష్ట్రాల మూలధనం వ్యయం ఆధారంగా క్యాపెక్స్ మూడో రివ్యూ వచ్చే ఏడాది మార్చిలో, తుది రివ్యూ జూన్‌లో జరగనున్నది.
సీఎంలతో నిర్మల సమావేశం
కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) ముఖ్యమంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారని సోమనాథన్ వివరించారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థిరమైన వృద్ధి పథం వైపు తీసుకెళ్లేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నట్టు చెప్పారు.