Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీహెచ్పీ ఫిర్యాదుమేరకు 'ఉపా' కేసులు నమోదు
- మమ్మల్ని బెదిరిస్తున్నారు : మహిళా జర్నలిస్టులు
అగర్తలా : 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం'(ఉపా) కింద త్రిపురలో వందలాది జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసు కేసులు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల్లో ఇద్దరు మహిళలున్నారు.నోటీసులు అందజేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులు తమను అనధికారికంగా నిర్బంధించారని సమృద్ధీ సకూనియా, స్వర్ణ ఝా అనే ఇద్దరు జర్నలిస్టులు ఆరోపించారు. అగర్తలాలో తాము బస చేసిన హోటల్ నుంచి బయటకు రానివ్వటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వారు ట్విట్టర ్లో సందేశాలు పోస్ట్ చేశారు. కేసు విచారణలో సహకరిస్తున్నా..తమను అక్రమంగా నిర్బంధించారని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జర్నలిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసింది. రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని రేపారని, కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని 'ఉపా'లోని సెక్షన్ 153-ఎ, సెక్షన్-120(బి) కింద త్రిపుర పోలీసులు ఆ ఇద్దరు జర్నలిస్టులపై కేసులు నమోదుచేశారు. హిందూ అతివాద సంస్థ 'విశ్వహిందూ పరిషత్'(వీహెచ్పీ) ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈనేపథ్యంలో నోటీసులు అందజేశాక పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని, హోటల్ గది దాటి బయటకు రాకుండా, తమ న్యాయవాదిని కలుసుకోనివ్వకుండా నిర్బంధించారని మహిళా జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్ని అగర్తలా పోలీసులు కొట్టిపారేశారు. వారిని స్వేచ్ఛగా వదలిపెట్టామని పోలీస్ అధికారి తెలిపారు.