Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డయాబెటిస్ కేసుల పెరుగుదలకు మహమ్మారి కారణమా?
- గుర్తించేందుకు వైద్యుల ప్రయత్నాలు
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి మధుమేహానికి దారి తీస్తుందా? దేశంలో డయాబెటిస్ కేసుల పెరుగుదలకు ఇదే కారణమవుతున్నదా? దేశంలో కరోనాతో చికిత్స పొందుతున్న కొందరిలో డయాబెటిస్ నిర్ధారణ కావడమే ఈ అనుమానాలకు తావిస్తున్నది. అయితే, ఇది ఎంత వరకు నిజం అన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్యులు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారితో సయాన్ ముఖర్జీ (49) చికిత్స పొందుతున్నారు. అయితే, వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ముఖర్జీకి డయాబెటిస్ నిర్ధారణ అయ్యింది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ముఖర్జీ మందులు వాడుతున్నారు. దేశంలో ఒక్క ముఖర్జీ మాత్రమే కాదు.. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న పలువురిలో ఈ వ్యాధి బయటపడినట్టు తాము గుర్తించినట్టు కొందరు వైద్యులు తెలిపారు. '' గత రెండేండ్లుగా నేను చూసిన ప్రతి నలుగురు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఒకరు కోవిడ్-19 చికిత్స పొందుతున్నవారే. వారికి మెటబాలిక్ డిసీజ్ (జీవక్రియ వ్యాధి) నిర్ధారణ అయింది'' అని ఢిల్లీలో ఒక ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఎస్.కే. వాంగూ తెలిపారు. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమయ్యే జీవక్రియ పరిస్థితి నేరుగా కరోనా వైరస్ ఇన్షెక్షన్ ద్వారా ప్రేరేపించబడిందా? లేదా క్షుణ్ణంగా పరీక్షించిన ఫలితంగా నిర్ధారణ అయిందా? అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలి యాల్సి ఉన్నది. ఈ విషయంపై ఇప్పుడు వైద్యులు పరీక్షలు జరుపుతున్నారు. అయితే,మహమ్మారి ప్రవేశించిన తర్వాత మధుమేహం వ్యాప్తిలో కచ్చితంగా పెరుగుదల ఉండబోతోందని వైద్యులు చెప్తున్నారు. ''కోవిడ్-19..డయాబెటిస్ కేసుల పెరుగుదలకు దారి తీసిందా అన్నదానిపై అంచనాకు రావడానికి దేశవ్యాప్తంగా జరిపే అధ్యయనంలో తమ ఆస్పత్రి పాల్గొంటున్నది''అని వాంగూ చెప్పారు.