Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారయంత్రాంగమే కారణం : పర్యావరణ కార్యకర్త దిశారవి
బెంగళూరు: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న అంతర్జాతీయం పర్యావరణ సదస్సు కాప్26కు తాను హాజరుకాకపోవడానికి కారణం ప్రభుత్వ యంత్రాంగమేనని పర్యావరణ కార్యకర్త దిశారవి ఆరోపించారు. కాప్26 సదస్సులో పాల్గొనడానికి 88 రోజుల ముందే తాను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాననీ, అయితే, పాస్‌పోర్ట్ సకాలంలో అందడానికి ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం లేకపోవడం వల్లనే తాను గ్లాస్గో సమ్మిట్‌లో పాల్గొనకుండా చేసిందన్నారు. ''నేను కాప్26 సదస్సులో ఉండాల్సింది. గ్రిస్ట్ కోసం రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నేను అక్కడ ఉండటానికి అర్హురాలిని. అయితే, నాకు పాస్‌పోర్ట్ నిరాకరించబడింది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసి 88 రోజులు దాటినా ఇంకా అది అందలేదు''అని దిశారవి అన్నారు. బెంగళూరులోని ఒక పోలీసు అధికారి తన పాస్‌పోర్ట్ డెలివరీ చేయడానికి నిరాకరించాడనీ, అలాగే, ''తిరుగుబాటుదారుని పెంచుతున్నావంటూ తన తల్లిని మందలించాడని తెలిపింది. ఆ పోలీసు అధికారి తనను పరారీలో ఉన్న బిలియనీర్ విజరు మాల్యాతో పోల్చారని ఆమె అన్నారు. దేశంలో ఒక పౌరుడు ఖైదు చేయబడితే అతనికి పౌర స్వేచ్ఛలు నిరాకరించబడతాయని'' దిశా రవి పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ను పొందడంలో జాప్యంపై దిశా రవి చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వివాదస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. బయటకు వచ్చిన టూల్‌కిట్ వ్యవహారంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం, కుట్ర ఆరోపణలు మోపుతూ ఆమెపై కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెకు బెయిల్ లభించింది.