Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఐబీ నుంచి 3,716 కోట్లకు పైగా రుణం కోరిన మోడీ సర్కారు
- టీకాల కోసం చేసిన ఖర్చు పైనా లేని అధికారిక సమాచారం
- 'పీఎం-కేర్స్' సమాచారమూ వెల్లడించని కేంద్రం
- విదేశీ రుణాలపై దేశీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల 100 కోట్లకు పైగా కరోనా వ్యాకిన్లను అందించామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రచారంతో ఊదరగొట్టింది. ప్రజలకు టీకాలు అందించే విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ చక్కటి ప్రతిభ కనబరుస్తున్నదని కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు గొప్పగా సభల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేశారు. అయితే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల విషయంలో గొప్పల కోసం తిప్పలు పడుతున్నది. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం అప్పులు చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌లో విదేశీ నిధులు గణనీయంగా ఉన్నాయి. కొన్ని వార్త సంస్థల సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది.
భద్రత, ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేంద్రం ఇప్పటికే ఏసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3,716 కోట్లకు పైగా) రుణాన్ని కోరింది. వ్యాక్సిన్లను సమకూర్చుకోవడంలో సభ్య దేశాలకు సహాయం అందించడం కోసం 9 బిలియన్ డాలర్లతో ( సుమారు రూ. 66.98 వేల కోట్లకు పైగా) గత డిసెంబర్లో ఏసియా పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఏపీవీఏఎక్స్) ప్రోగ్రామ్‌ను ఏసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) ప్రకటించిన విషయం విదితమే. అయితే, మోడీ సర్కారు అభ్యర్థన మేరకు ఏడీబీ కూడా రుణ సహాయంలో భాగం కానున్నది.
ఏడీబీ నుంచి దాదాపు రూ. 30 కోట్లు
వ్యాక్సినేషన్ సైట్ మానిటరింగ్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్స్ వంటి రంగాల్లో సాంకేతిక సహకారం కోసం ఏపీవీఏఎక్స్ అదనంగా 4 మిలియన్ డాలర్ల (రూ. 29.77 కోట్లకు పైగా) రుణాన్ని అందించనున్నది. కాగా, ఈ ఏడీబీ-ఏఐఐబీ రుణం దాదాపు 67 కోట్ల టీకాల (670 మిలియన్లు) కొనుగోలు కోసం ఉద్దేశించినదని సమాచారం.
వ్యాక్సిన్లకు అయిన ఖర్చు ఎంత?
ఇదిలా ఉండగా, దేశంలో వ్యాక్సిన్ డోసుల సంఖ్యను వెల్లడిస్తూ దానిని రాజకీయంగా వాడుకుంటున్న కేంద్రం.. ఇప్పటి వరకు వాటి మీద చేసిన ఖర్చు ఎంతో అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. అయితే, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు, పార్లమెంటుల్లో వెల్లడించిన సమాచారం, అధికారుల పత్రికా ప్రకటనల ప్రకారం.. దేశంలో దాదాపు వంద కోట్ల డోసుల కోసం రూ. 19 వేల కోట్ల మేర (2.54 బిలియన్ డాలర్లు) ఖర్చు అయినట్టు అంచనా.
పీఎం-కేర్స్ ఫండ్ గోప్యత
ఇక కరోనా ఆపత్కాల సమయంలో ప్రధాని మోడీ 'పీఎం-కేర్స్ ఫండ్' ను గతేడాది మార్చిలో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇది ఏర్పాటైన 52 రోజుల వ్యవధిలోనే దాదాపు 1.27 బిలియన్ డాలర్లు ( రూ. 9,451 కోట్లకు పైగా) వచ్చి చేరాయి. ఇందులో అధికం కార్పొరేటు ఫండ్స్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఒక రోజు వేతనం ఇలా పలు మార్గాల ద్వారా పీఎం కేర్స్‌కు నిధులు అందినట్టు 'ఇండియాస్పెండ్' వెబ్సైట్ సమాచారం. కాగా, కొన్ని దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న ప్రధాన మంత్రి జాతీయ విపత్తు నిధిని (పీఎంఎన్ఆర్ఎఫ్) కాదని కొత్తగా పీఎంకేర్స్‌ను ఏర్పాటు చేయడంపై అప్పట్లో కేంద్రంపై చాలా విమర్శలు వచ్చాయి. పలు అనుమానాలూ, ప్రశ్నలూ తలెత్తాయి. 2019, డిసెంబర్ నాటికి పీఎంఎన్ఆర్ఎఫ్ కార్పస్ ఫండ్‌లో ఖర్చు చేయకుండా మిగిలిన మొత్తం రూ. 3,800 కోట్లుగా ఉన్నది.
అయితే, పీఎంకేర్స్‌కు భారీ మొత్తంలో విరాళాలు వచ్చి చేరినప్పటికీ వ్యాక్సిన్లను సమకూర్చుకోవడానికి విదేశీ రుణాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏమున్నదని నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నించారు. అంతేగాక, ఈ నిధికి సంబంధించిన వివరాలను, డొనేషన్ వనరులను వెల్లడించకుండా ప్రభుత్వం కప్పి ఉంచడం గమనార్హం. అలాగే, ఫెడరల్ ఆడిట్‌కు గానీ, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం పొందడానికి గానీ అవకాశం లేకుండా దీనిని '' ఒక ఇండిపెండెంట్ ట్రస్ట్''గా కేంద్రం జాగ్రత్త పడింది. ఇక వ్యాక్సిన్ అభివృద్ధి, వలస కార్మికుల సంక్షేమం, వెంటిలేటర్ల కొనుగోలు కోసం రూ. 3,100 కోట్లను కేటాయించినట్టు పీఎంకేర్స్ వెబ్సైట్లో ఉన్నది. అయితే, దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం గతేడాది నుంచి పొందుపర్చకపోవడం గమనార్హం.
'దేశ ఆర్థికవ వ్యవస్థపై విదేశీ రుణాల ప్రభావం'
ఇక కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 35 వేల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించారు. అవసరమయితే మరిన్ని నిధులను కేటాయిస్తామనీ హామీ ఇచ్చారు. అయితే, ఇందుకు ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందా అన్న విషయాన్ని మాత్రం ఆమె తెలపకపోవడం గమనార్హం. కాగా, వ్యాక్సిన్ల కొనుగోలుపై కేంద్రం ఖర్చు చేస్తున్న విధానం 'ఏకపక్షమని' సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో స్పష్టతనూ కోరింది. కాగా, వ్యాక్సిన్లపై ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తంలో రూ. 4,489 కోట్లను ఖర్చు చేసినట్టు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా జూన్‌లో కేంద్రం వెల్లడించింది. అయితే, బయటి రుణాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ. 14,886 కోట్లకు పైగా (2 బిలియన్ డాలర్ల) విదేశీ రుణాలు భారతదేశ రుణ-జీడీపీ నిష్పత్తి పెరుగుదలకు కారణమవుతాయని వివరించారు.
అప్పుల కుప్ప
గత ఐదేండ్లకు పైగా భారత అప్పులు క్రమంగా పెరగుతున్నాయి. అయితే, ప్రస్తుత వేగంతో భారత అప్పు తన జీడీపీలో 90 శాతం దాటుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ఒకటి అంచనా వేసింది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత విదేశీ రుణాలు దాదాపు రూ. 42 లక్షల కోట్లకు పైగా ( సుమారు 571 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ పెరుగుదల రూ. 11 వేల కోట్లకు పైగా ( దాదాపు 1.6 బిలియన్ డాలర్లు) ఉన్నది. ఈ విధంగా విదేశీ అప్పులు పెరిగే విషయంలో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు సైతం భారత్‌ను ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం.