Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం రెండేండ్లే.. తాజాగా ఐదేండ్లకు పెంపు
- కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌ల పదవీ కాలాన్ని ఐదేండ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రెండు కేంద్ర సంస్థల చీఫ్‌లకు ప్రస్తుతం రెండేండ్ల పదవీకాలం ఉన్నది. ఈ రెండు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ ప్రధాన ఏజెన్సీల చీఫ్‌లు రెండేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత, ఒకేసారి ఒక ఏడాది వరకు పొడిగించ వచ్చనీ, మొత్తం మీద ఐదేండ్ల వరకు పొడిగించవచ్చునని ఈ ఆర్డినెన్సులు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్లను రెండేండ్ల నిర్ణీత కాలానికి నియమిస్తున్నారు. ఈ రెండేండ్ల పదవీ కాలం ముగియక ముందు వీరిని తొలగించడం సాధ్యం కాదు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత వారి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. తాజాగా విడుదల చేసిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్-2021 ప్రకారం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ నియామక ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలం ముగిసిన తర్వాత క్లాజ్ (ఏ) ప్రకారం కమిటీ సిఫారసు చేసిన మీదట ప్రజా ప్రయోజనాల రీత్యా, లిఖిత పూర్వకంగా రాయదగిన కారణం మేరకు ఒక ఏడాది వరకు పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలంతోపాటు పొడిగించిన పదవీ కాలంతో కలిపి మొత్తం మీద పదవీ కాలం ఐదేండ్లకు మించరాదు. అదే విధంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్-2021ను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ రెండు ఆర్డినెన్సులు తక్షణం అమల్లోకి వచ్చాయి. ''పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు, రాష్ట్రపతి వెంటనే చర్య తీసుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయి'' అని ఆర్డినెన్స్‌లు నొక్కి చెబుతున్నాయి. ''ప్రాథమిక నియామకంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తం ఐదేండ్ల వ్యవధి పూర్తయిన తర్వాత అటువంటి పొడిగింపు మంజూరు చేయబడదు'' అని ఆర్డినెన్స్ స్పష్టం చేశాయి. 1997కు పూర్వం సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వం ఏ విధంగానైనా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించే అవకాశం ఉండేది. అయితే సుప్రీం కోర్టు వినీత్ నారాయణ్ కేసులో ఇచ్చిన తీర్పులో సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం కనీసం రెండేండ్లు ఉండాలని తెలిపింది.
2018లో బాధ్యతలు స్వీకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ ఎస్కే మిశ్రా పొడిగింపుతో ముడిపడి ఉన్న కేసులో జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. పదవీకాలం పొడిగింపు ''అరుదైన, అసాధారణమైన కేసులలో మాత్రమే చేయాలి'' అని స్పష్టం చేసింది. నవంబరు 17న ఆయన పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో ఈ పరిణామంతో మరో ఏడాది పొడిగించబడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెవిన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రత్యేక ఆర్థిక దర్యాప్తు సంస్థ, ఇది విదేశీ మారకపు చట్టాలు, నిబంధనలు, మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది. వివిధ పార్టీల నేతలు, మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. మోడీ సర్కార్ తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌ను రాజకీయపార్టీలు, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.