Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు నేతల స్పష్టీకరణ
పిలిభిత్ : లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతలో అజయ్ మిశ్రా టేనిని తొలగించి అరెస్టు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. అమాయక రైతులపై హత్యాకాండకు పాల్పడిన దోషులందరికీ శిక్షపడే వరకు న్యాయ పోరాటం చేస్తామనిఉద్ఘాటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలోని పురాన్‌పూర్‌లో 'లఖింపూర్ న్యారు మహాపంచాయత్' భారీగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ గాయపడిన వారందరికీ నష్ట పరిహారం అంశాన్ని లేవనెత్తారు. వ్యవసాయం, ఆహార వ్యవస్థల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య రైతుల పోరాటం విస్తరిస్తోంది. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ప్రభుత్వ గోదామును ప్రయివేట్ సంస్థకు అప్పగించడంపై 25 రోజులుగా నిరసనలు కొనసాగు తున్నాయి. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలకు దురుద్దేశాలను ఆపాదిస్తూ హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా చేసిన ప్రకటనలను ఎస్కేఎం ఖండించింది. హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి (హైపవర్డ్ కమిటీ) మోడీ ప్రభుత్వంతో చర్చల పునరుద్ధరణకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారనీ, అది వాస్తవ విరుద్ధమని స్పష్టం చేసింది. అవమానకరమైన, తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని డిప్యూటీ సీఎంను ఎస్కేఎం కోరింది.
ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్న రైతులు
చారిత్రత్మాక రైతు ఉద్యమం మొదటి వార్షికోత్సవం సమీపిస్తున్నందున వందలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ఆందోళన వేదికలకు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్‌లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఆందోళన వేదికలకు చేరుకుంటున్నారు. హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన మేవా సింగ్ పునియా అనే మరో రైతు సింఘూ సరిహద్దులో ఆదివారం అమరుడయ్యాడు. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు సుమారు 665 మంది రైతులు అమరులయ్యారు. అయితే మోడీ ప్రభుత్వం ఆందోళనలో ఎంత మంది ప్రాణాలను బలిగొంటున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్కేఎం విమర్శించింది.