Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి : సౌత్ జోనల్ కౌన్సిల్లో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
- దక్షిణాది రాష్ట్రాల సహకారం లేకుండా.. దేశాభివృద్ధి అసాధ్యం : అమిత్‌షా
తిరుపతి : విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరితగిన పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి తాజ్ హోటల్ వేదికగా జరిగిన సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. విభజన సందర్భంగా ఇస్తామని చెప్పిన 'రీసోర్స్ గ్యాప్' నిధులను కేంద్రం ఇవ్వాలన్నారు. 2014-15 సంబంధించి కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2, 2014 నుంచి మార్చి 31, 2015 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు ఏకంగా రూ. 22,948.76 కోట్లకు చేరుకుంది. తెలుగురాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ, వాటి విలువ దాదాపు 1,42,601 కోట్లుగా అంచనా. ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోందని, కేంద్రం జోక్యంచేసుకోవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో కీలకమని, ఈ హామీని నెరవేర్చాలని కోరారు. తెలుగు గంగ ప్రాజ ెక్టుపై అంతర్రాష్ట్రంగా ఉన్న సమస్యను పరిష్కరించాలి. తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నరు నగర తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీటిని సరఫరా చేస్తూనే ఉన్నామని, నీటి సరఫరా నిర్వహణకు సంబంధించి గత పదేళ్లుగా ఆరాష్ట్రం నుంచి 339.48కోట్లు రావాల్సిఉందన్నారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం కాలడ్డుతోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణంవల్ల కుప్పం ప్రజల కు తాగునీరుఅందుతోందని, ఈవిషయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్బీసీలో కోత విధించడం సరి కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించడం సరైనది కాదన్నారు. రేషన్ బియ్యం కేటాయింపులో హేతుబద్దత లేదన్నారు.జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయి. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ప్రజాపంపిణీ వ్యవస్థలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. ఈ సమావేశాలకు వేదికగా తిరుపతిని ఎంచుకున్నందుకు స్టాండింగ్కమిటి చైర్మెన్ అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల సహకారం లేనిదే..అమిత్‌షా
'దక్షిణాది రాస్ట్రాల సహకారం లేకుండా భారతదేశ అభివృద్ధిని ఊహించలేం' అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. దేశంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే సహకార, పోటీతత్వ సమాఖ్యవాదాన్ని పెంపొందించుకోవాలన్నారు. తిరుపతి తాజ్ హోటల్లో దక్షిణ ప్రాంతీయ మండలి 29వ సమావేశం అమిత్‌షా అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మరు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, హోంశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. తమిళనాడు, తెలంగాణా, కేరళ సీఎంలు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ దక్షిణ భారతదేశ రాస్ట్రాల ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు, భాషలు ప్రాచీన వారసత్వాన్ని సుసంపన్నం చేశాయన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను గౌరవిస్తోందని, నేటి దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలోనూ వారివారి స్వభాషలో మాట్లాడేందుకు మొగ్గుచూపితే తాను సంతోషిస్తానని అభిలషించారు. ప్రాంతీయ మండళ్లు, సలహా సంఘాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం వల్ల అనేక సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకున్నామన్నారు. గత ఏడు సంవత్సరాలలో 18 మండల పరిషత్‌ల సమావేశాలను నిర్వహించామనీ, గతంలో చాలా తక్కువగా జరిగేవని తెలియజేశారు.