Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదరికం, అసమానతలుంటే ఏం చేసినా అర్థరహితం
- ఇప్పటికీ ఉన్నవారు, లేనివారు అనే తేడా ఒక నిజం
- లబ్దిదారులకు ప్రయోజనాలు అందట్లేదు
- ప్రజల పోరాటాలు, ఆకాంక్షలు రాజ్యాంగాన్ని రూపొందించాయి : నల్సా కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : ''సంక్షేమ రాజ్యంలో మనం భాగమై నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లబ్దిదారులకు అందడం లేదు. గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ప్రజల ఆకాంక్ష తరచుగా సవాళ్లను ఎదుర్కొంటుంది. వాటిలో ప్రధానంగా పేదరికం ఒకటి'' అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఆదివారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) నిర్వహించిన 'పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్, ఔట్రీచ్ క్యాంపెయిన్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ హాజరై మాట్లాడారు. దురదృష్టవశాత్తు, స్వతంత్ర భారతదేశం లోతుగా విచ్ఛిన్నమైన సమాజాన్ని వారసత్వంగా పొందిం దనీ, ''ఆర్థిక స్వేచ్ఛ లేకుండా నిజమైన స్వాతంత్య్రం ఉండదు. ఆకలితో ఉన్న వ్యక్తిని స్వేచ్ఛాజీవిగా పిలవడం, అతనిని వెక్కిరించడమే'' అని నెహ్రూ మాటలను ఉటంకించారు. ఉన్నవారు, లేనివారు అనే తేడా ఇప్పటికీ ఉన్న వాస్తవమనీ, పేదరికం, అసమానతల నేపథ్యంలో మనం ఎన్ని ప్రతిష్టాత్మకమైన డిక్లరేషన్లు విజయవంతం చేసినా, అవన్నీ అర్థరహితంగా కనిపిస్తాయని వివరించారు. దేశ ప్రజానీకపు దుస్థితిని తగ్గించడానికి పాలక వలసవాద శక్తి పెద్దగా ఏమీ చేయలేదనీ, స్వాతంత్య్ర ఉద్యమం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం అందరికీ గౌరవం, సమానత్వంతో కూడిన జీవితాన్ని కనుగొనడమని తెలిపారు. దేశ ప్రజల పోరాటాలు, వారి ఆకాంక్షలు మన రాజ్యాంగాన్ని రూపొందించాయనీ, ఇది సమానత్వ భవిష్యత్తును వాగ్దానం చేసిందని తెలిపారు.
కోర్టులు స్వతంత్రంగా పని చేయాలి
మనం తీసుకునే నిర్ణయాలు అత్యంత సామాజిక ప్రభావాన్నికలిగి ఉంటాయనీ, కాబట్టి అవి సులభంగా అర్థమయ్యేలా ఉండాలన్నారు. న్యాయమూర్తులు సరళమైన, స్పష్టమైన భాషలో తీర్పులు రాయాలని సూచించారు. రాజ్యాంగ న్యాయస్థానాలు సంపూర్ణ స్వాతంత్య్రంతోనూ, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యంతోనూ పనిచేయగల సామర్థ్యాన్ని,ఇది సంస్థ స్వభావాన్ని నిర్వచిస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని సమర్థించే మన సామార్థ్యం నిష్కళంకమైన లక్షణాన్ని నిలబెడుతున్నదనీ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి వేరే మార్గం లేదని చెప్పారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, సుప్రీం కోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని కూడా ఆయన అన్నారు. రాజ్యాంగ న్యాయస్థానాలు అట్టడుగున ఉన్న వారికి అండగా నిలిచాయనీ, ఈ సంక్షేమ రాజ్యాన్ని రూపొందించడంలో న్యాయ వ్యవస్థ ముందంజలో ఉన్నదని ఆయన తెలిపారు. సంక్షేమ రాజ్యాంగ సూత్రాలను తమ గుండెల్లో పెట్టుకుని రాజ్యాంగ ధర్మాసనాలు దేశంలో అట్టడుగు వర్గాల వారికి అండగా పని చేశాయనడానికి దేశ చరిత్రే నిదర్శనమని అన్నారు. సంక్షేమ రాజ్యాన్ని రూపొందించడంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ముందుందనీ, దేశంలోని రాజ్యాంగ న్యాయ స్థానాల నిర్ణయాలు సామాజిక ప్రజాస్వామ్యం వృద్ధి చెందడానికి వీలు కల్పించాయని చెప్పారు. సామాజిక క్రమాన్ని మార్చి, రాజ్యాంగ పీఠికలో వాగ్దానం చేసిన వాటిని ప్రజలు అందించే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక న్యాయాన్ని అందించాలని అన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నల్సాలో మనం చేసే పని చాలా అవసరమనీ, ఇది బహుశా సమాజంలోని కొన్ని వర్గాలకు న్యాయం పొందేందుకు ఏకైక మార్గమని అన్నారు.
ఎక్కువ మందికి అందుబాటులో కింద కోర్టులు
సమర్థవంతమైన న్యాయ సహాయం, సమర్ధవంతమైన న్యాయ బట్వాడా యంత్రాంగానికి వెన్నెముక అనీ, అట్టడుగు స్థాయిలో పటిష్టమైన న్యాయ బట్వాడా వ్యవస్థ లేకుండా, ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థను మనం ఊహించలేమని జస్టిస్ ఎన్వి రమణ నొక్కి చెప్పారు. ట్రయల్ కోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థల చర్యల ద్వారా మిలియన్ల మంది మనస్సును తెలుసుకోవచ్చనీ, అధిక సంఖ్యలో పిటిషన్ దారులకు అందుబాటులో ఉన్నది జిల్లా న్యాయవ్యవస్థ మాత్రమేనని అన్నారు. అన్ని స్థాయిలలో న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం, సమగ్రతను రక్షించడం, ప్రోత్సహించడం కంటే మరేదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు. హైకోర్టుల పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నదనీ, రాష్ట్రంలోని అన్ని కోర్టుల పనితీరును పర్యవేక్షించే బాధ్యత హైకోర్టులకు అప్పగించబడిందని తెలిపారు. సంపూర్ణ న్యాయం అందించడానికి హైకోర్టులు స్థానిక ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమమని అన్నారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ ప్రజలతో దగ్గరి సంబంధం కలిగి ఉండటం వల్ల, వారి సమస్యలు, ఆచరణాత్మక ఇబ్బందుల గురించి సున్నితంగా అవగాహన కలిగి ఉండాలని, అన్నింటికంటే చట్టం మానవీయంగా పనిచేయాలని సూచించారు. ఆపదలో ఉన్న స్త్రీ, సంరక్షణ అవసరమైన బిడ్డ, అక్రమ నిర్బంధంలో ఉన్నవారు ముందుగా సంప్రదించేది ట్రయల్ కోర్టులనే అని గుర్తుంచుకోవాలని సూచించారు.
సామాజిక సమస్యలను నిర్మూలించడంలో యువత
ప్రస్తుతం ఉన్న సామాజిక సమస్యలను నిర్మూలించడంలో యువత చురుకైన ఆసక్తి, కచ్చితంగా ఉజ్వల భారతదేశానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. కష్టాలు అనుభవిస్తున్న వారు వ్యక్తులు మంచి దుస్తులు ధరించి, వివేకవంతమైన న్యాయవాదులు, భారీ కోర్టు భవనాల కోసం వెతకరనీ, వారికి కావాల్సినది, త్వరగా వారి నొప్పి నుంచి ఉపశమనం పొందడమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాకుండా న్యాయ సహాయ ఉద్యమంలో న్యాయ విద్యార్థుల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేమని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవల అధికారులు న్యాయ సహాయం ఉద్యమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు.
రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ పెద్ద (న్యాయ వ్యవస్థ)గా న్యాయ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది సభ్యులందరికీ తప్పనిసరిగా ఓదార్పు, అండగా నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మతి ఇరానీ, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఎస్సీఎల్ఎస్సీ చైర్మన్ జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, అటర్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నల్సా బ్రోచర్‌ను విడుదల చేశారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులే అతిధులకు పుష్పగుచ్ఛం, మెమోంటోలు అందజేశారు.