Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణనీయంగా తగ్గిన కేంద్ర ప్రభుత్వ వ్యయం
- ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో ఖర్చు 47శాతమే
- రైతు సంక్షేమం, విద్య, ఉపాధి కల్పన విభాగాల్లో భారీగా కోతలు
- సుమారు రూ.2.5లక్షల కోట్లు కోత
- అభివృద్ధి, సంక్షేమంలో నిలిచిపోయిన పథకాలు
అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఇంధన ధరల సంగతి చెప్పక్కర్లేదు. కేంద్రం విధించే పన్నులతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. ఇదీ..అదీ..అనే కాదు. ప్రతిదానిపై పన్నుల మోత మోగిస్తున్నారు. మరి ఈ డబ్బంతా ఎటు పోతోంది? ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మోడీ సర్కార్ ఖర్చు చేస్తోందా? అంటే..అదీ లేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి ఆరు నెలల కాలంలో(ఏప్రిల్-సెప్టెంబర్) కేంద్ర బడ్జెట్లో వ్యయం 55శాతం దాటాలి. కానీ ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ వ్యయం 47శాతానికి పడిపోయింది.
న్యూఢిల్లీ : ప్రతి వస్తువుపై ప్రభుత్వాలు పన్నుల మీద పన్నులు విధించి లక్షల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంటు న్నాయి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే ఈ పన్నులు వసూలు చేస్తున్నామని కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఇవన్నీ ఉత్తమాటలేనని తేలిపోయింది. పాఠశాల, ఉన్నత విద్య, వ్యవసాయం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, గిరిజన సంబంధాలు..ఇలా అనేక శాఖల్లో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ వ్యయం తగ్గింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) విడుదల చేసిన తాజా గణాంకాలే ఈ విషయాన్ని రూఢ చేస్తున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూ.34.8లక్షల కోట్లు (అంచనా). మొదటి సగభాగమైన ఏప్రిల్-సెప్టెంబర్లో ప్రభుత్వ వ్యయం సహజంగా 55శాతం దాటాలి. కానీ కేంద్ర ప్రభుత్వ వ్యయం 47శాతానికి తగ్గింది. కరోనా రాకముందు మూడు సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ప్రభుత్వ వ్యయం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2017-18లో 54శాతం, 2018-19లో 53శాతం, 2019-20లో 53శాతంగా ఉంది. కరోనా సంక్షోభం తలెత్తిన 2020-21లో 49శాతంగా నమోదైంది.
ఇదేమీ చిన్న మొత్తం కాదు..
కరోనా సంక్షోభం తలెత్తిన గత ఏడాది కఠినమైన లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పరిశ్రమలు మూతపడటంతో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రయివేటు పెట్టుబడి సైతం దెబ్బతిన్నది. ఈ ఏడాది తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదాయం మళ్లీ లక్షల కోట్లకు చేరుకుంది. పప్పులు, మాంసం, వంట నూనె, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్..ఇలా ప్రతి దానిపైనా మోడీ సర్కార్ పన్నులు పెంచి ఆదాయాన్ని పెంచుకుంది. మరోవైపు కీలకమైన ప్రభుత్వ శాఖలన్నింటిలో వ్యయ నియంత్రణను పాటిస్తోంది. తద్వారా సుమారుగా రూ.2-2.5లక్షల కోట్లు తగ్గినట్టు వ్యయంలో కోతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది చిన్న మొత్తం కాదు. దేశంలో కోట్లాది పేద కుటుంబాల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన సొమ్ము ఇది.
అధిక వాటా పెండింగ్ బిల్లులదే
ఉపాధి హామీ పనులకు(నరేగా) కేటాయించిన నిధుల్లో వ్యయం 61శాతం ఉందని సీఏజీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే గత ఏడాది ఉపాధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లుల్ని ఈ ఏడాదిలో చెల్లించారని, దాంతో వ్యయం పెంచి చూపారని సమాచారం. గ్రామీణాభివృద్ధిలో ఉన్న పథకాలన్నింటిదీ ఇదే తీరు. ప్రతి ఏటా పెండింగ్ బిల్లులు పేరుకుపోవటం, తదుపరి సంవత్సరం అరకొరగా వాటికి చెల్లింపులు చేయటం మోడీ సర్కార్ ఆనవాయితీగా చేస్తూ వస్తోంది. అందువల్లే దేశవ్యాప్తంగా ఉపాధి సమస్య తీవ్రరూపం దాల్చిందని నిపుణులు చెబుతున్నారు.
రైతుల సంక్షేమంలోనూ కోతలు
కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టాక, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం కోసం నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎక్కువగా వ్యయం చేస్తుందని అంచనావేశారు. కానీ కేంద్రం అలా చేయకపోగా కేవలం 24శాతానికి వ్యయాన్ని పరిమితం చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్న మోడీ సర్కార్, నిధుల వ్యయం దగ్గరమాత్రం 45శాతం దాటలేదు. క్రితం సంవత్సరాలతో పోల్చితే వ్యవసాయం, రైతుల సంక్షేమం, చేపలు, పశుపెంపకం, పాల ఉత్పత్తి విభాగాల్లో ప్రభుత్వ వ్యయం గణనీయంగా తగ్గింది.
ఈ ప్రశ్నకు బదులేది?
కరోనా సంక్షోభం తలెత్తాక పేద, మధ్య తరగతి ఉపాధి దెబ్బతిన్నది. ఆదాయం పడిపోయింది. కానీ బయట సామాన్యుడి ఖర్చు తగ్గలేదు. అదేసమయంలో మోడీ సర్కార్ రుణాలతో, ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మటం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ప్రతిదానిపైనా పన్నులు పెంచింది. పన్ను ఆదాయాన్ని భారీగా పెంచుకుంది. మరి ఇదంతా ఎటు పోతోంది? అనేది సామాన్యుడి మదిని తొలిచేస్తున్న ప్రశ్న.
కేంద్ర ప్రభుత్వ శాఖ వ్యయం
(ఏప్రిల్-సెప్టెంబర్)
వ్యవసాయం, రైతుల సంక్షేమం 45శాతం
పాఠశాల విద్య 29శాతం
ఉన్నత విద్య 42శాతం
తాగునీరు, పారిశుద్ధ్యం 22శాతం
సామాజిక న్యాయం, సాధికారత 8శాతం
గిరిజన సంక్షేమం 28శాతం
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు 25శాతం
చేపలు, పశుపెంపకం, పాల ఉత్పత్తి 42శాతం
ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి 46శాతం
మైనార్టీల అభివృద్ధి 17శాతం
నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి 24శాతం
ఎంఎస్ఎంఈ 45శాతం
పునరుత్పాదక శక్తి 30శాతం
వస్త్ర పరిశ్రమ 35శాతం
పర్యాటకం 9శాతం
మహిళా, శిశు అభివృద్ధి 47శాతం
యువత, క్రీడలు 33శాతం