Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు స్కూళ్లలో వెనుకబడిన వర్గాల చిన్నారులకు ఉచిత బోధన
- ఎన్రోల్మెంట్ తక్కువ
- ఎన్సీపీసీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని (యూటీ) ప్రయివేటు పాఠశాలలు.. వెనుకబడిన, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల చిన్నారులకు ఎలాంటి ఫీజూ తీసుకోకుండా అడ్మిషన్లను కల్పిస్తున్నాయి. వారికి ఉచితంగా బోధిస్తున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) తన నివేదికలో కనుగొన్నది. దేశంలో విద్య హక్కు చట్టం (ఆర్టీఈ) లోని సెక్షన్ 12(1)(సీ) అమలుపై ఎన్సీపీసీఆర్ ఈ నివేదికను తయారు చేసింది. ఈ సెక్షన్ కింద వెనుకబడిన వర్గాల చిన్నారులకు ప్రయివేటు అన్ఎయిడెడ్ స్కూళ్లు 25 శాతం సీట్లను కల్పించాలి. అయితే, దేశంలోని 16 రాష్ట్రాలు, యూటీలు మాత్రమే ఈ సెక్షన్ కింద ఆ వర్గాలకు చెందిన చిన్నారులకు ఉచిత విద్యను కల్పిస్తున్నట్టు ఎన్సీపీసీఆర్ నివేదికలో వెల్లడి కావడం గమనార్హం. కాగా, ఈ జాబితాలో అసోం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం కింద భారత్‌లో 6-14 ఏండ్ల చిన్నారులకు ఉచిత, నిర్బంధ విద్య తప్పనిసరి.
అయితే, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. '' ఈ వర్గాలకు చెందిన చిన్నారుల పేర్ల నమోదు మొత్తం ఎన్రోల్మెంట్లో 5.4 శాతంగా ఉన్నది. విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం ఇది కనీసం 25 శాతంగా ఉండాలి'' అని నివేదిక వివరించింది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను కేంద్ర విద్య మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది జలైలో సమర్పించారు. అయితే, ఈ నివేదికపై సంబంధిత మంత్రిత్వ శాఖ అధ్యయనం జరుపుతున్నది. దీని ఆధారంగా మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.