Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌహతి, న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వ పాలనలోని త్రిపురలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులపై నేరపూరిత కుట్ర, ఇతర ఆరోపణలతో కరింగంజ్ జిల్లాలోని పోలీసులు కేసు నమోదు చేసి నిర్బంధంలోకి తీసుకున్నారు. ఒక వీహెచ్‌పీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వీరిని అరెస్టు చేయడం విశేషం. హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్‌వర్క్‌కు చెందిన సమృద్ధి సకునియా , స్వర్ణ ఝా త్రిపురలో మసీదులపై దాడుల వార్తలను కవర్ చేయడానికి వచ్చారు. వీరిపై వీహెచ్‌పీ కార్యకర్త కంచన్దాస్ ఫిర్యాదు మేరకు గోమతి జిల్లాలోని కంక్రాబాన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ధర్మనగర్ పట్టణంలోని ఒక హోటల్లో బస చేస్తుండగా పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేశారు.
త్రిపుర పోలీసులు ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బృహన్ముంబయి యూనియన్ ఆఫ్ జర్నలిస్టులు (బీయూజే), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే) తీవ్రంగా ఖండించాయి. ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నా, వీరిపై పెట్టిన అన్ని కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, త్రిపుర పోలీసులు బెదిరింపు వ్యూహాలను ఆపాలని బీయూజే, డీయూజే డిమాండ్ చేశాయి. ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. వీరి అరెస్టుకు ఎలాంటి అరెస్టు వారెంట్లు లేవని, స్థానిక జర్నలిస్టులు, న్యాయవాదులు ఎంతగా నిరసన చేసినా కనీసం ఎఫ్ఐఆర్ కాపీలను కూడా చూపలేదని విమర్శించాయి.
'త్రిపుర పోలీసులు సమాచారాన్ని సెన్సార్ చేయాలనుకోవడం, నిశ్శబ్దంగా ఉంచాలనుకోవడం ప్రజాస్వామ్యానికి హానికరం. జర్నలిస్టుల సమాచారాన్ని సేకరించి ప్రచారం చేసే స్వేచ్ఛను అరికట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను కఠినంగా ప్రతిఘటించాలి. చట్టబద్ధమైన వృత్తిపరమైన విధుల కోసం నిమగమై ఉన్న జర్నలిస్టులను నేరస్థులుగా మార్చే క్రూరమైన ప్రయత్నాలను దేశవ్యాప్తంగా చూస్తున్నాం. జర్నలిస్టులు ఆసిఫ్ సుల్తాన్, సిద్దిక్ కప్పన్ ఆగస్ట్ 2018, అక్టోబర్ 2020 నుండి నిర్బంధంలో కొనసాగుతున్నారు. గత సంవత్సరంలోనే, కనీసం యాభై మంది జర్నలిస్టులు అరెస్టు చేయబడ్డారు, ఎఫ్ఐఆర్లను ఎదుర్కొన్నారు లేదా వారి కవరేజీల గురించి దాడికి గురికాబడ్డారు' అని ప్రకటనలో రెండు సంఘాలు విమర్శించాయి.
స్వతంత్ర మీడియాను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రతిఘటించాలనీ, మీడియాపై ఇలాంటి దాడులు, అరెస్టులకు వ్యతిరేకంగా సంఘీభావంగా చేతులు కలపాలని జర్నలిస్టులందరికీ బీయూజే, డీయూజే పిలుపునిచ్చాయి. భావప్రకటనా స్వేచ్ఛ, సమాచారాన్ని పొందే ప్రజాస్వామ్య హక్కు ప్రమాదంలో ఉన్నాయని ప్రకటనలో ఆరోపించాయి.