Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలా... లేని రాష్ట్రాల్లో మరోలా
- బీజేపీ వైఖరికి ఎస్కేఎం ఖండన
న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న స్పష్టమైన ద్వంద్వ వైఖరి విధానాలను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఖండించింది. ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణాలో ఎంఎస్పీని అమలు చేయాలనీ, కొనుగోళ్లను వేగవంతం చేయాలని బీజేపీ నిరసన కార్యక్రమాలుచేస్తున్నది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆందోళన చేస్తున్న రైతులపై దాడికి తెగబడుతున్నది. కేంద్రంలో అధికార బీజేపీ తన వాగ్దానాలను అనేకసార్లు విస్మరించింది. చట్టబద్ధంగా హామీ ఇచ్చిన ఎంఎస్పీ కోసం రైతుల డిమాండ్‌కు కట్టుబడి లేదని ఎస్కేఎం విమర్శించింది. ఈ నెల 22న లక్నోలో జరగ బోయే కిసాన్ మహాపంచాయత్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. జార్ఖండ్‌లోని రాంచీలో నవంబర్ 26న కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. నేడు (నవంబర్ 16)న ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో రైతులు సమావేశం జరగనున్నది. కర్నాటకకు చెందిన నాగరాజ్ సోమవారం రాజస్థాన్‌లోని ధోల్పూర్ చేరుకున్నారు. తర్వాత ఆయన యూపీలోని జజౌకు చేరుకోనున్నారు. మంగళవారం ఆగ్రా చేరుకుని 17న మధుర చేరుకుంటారు. నవంబర్ 18న యూపీలోని కోసి కలాన్‌కు, 19న హర్యానాలోని పల్వాల్‌కు చేరుకుంటారని భావిస్తున్నారు.
ఏఐకేఎస్ కార్యకర్తల స్ఫూర్తికి ఎస్కేఎం వందనాలు
హర్యానాలోని సిర్సా జిల్లా బజేకాన్ గ్రామానికి చెందిన 83 ఏండ్ల బాబా జీత్ సింగ్ రైతు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తున్న వేలాది మందిలో ఒకరు. ఆల్ ఇండియా కిసాన్ సభ నేతృత్వంలో ఆయన, ఆయన సహచరులు గ్రామస్తుల నుంచి ప్రతిరోజూ పాలను సేకరించి స్థానిక గురుద్వారా చిలా సాహిబ్ ద్వారా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు పంపుతున్నారు. రైతు ఉద్యమం కోసం నిరంతరం సేవ చేస్తున్న బాబా జీత్ సింగ్, ఇతరుల స్ఫూర్తికి ఎస్కేఎం వందనాలు తెలిపింది.