Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యంపై 24 గంటల్లోగా అత్యవరస సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. వాయు కాలుష్యంపై మంగళవారం సుప్రీం కోర్టు అత్యవసర విచారణ నిర్వహించింది. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతో అత్యవసర సమావేశం నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అత్యవసర, సమర్థవంతమైన కాలుష్య వ్యతిరేక చర్యలు, వాటి అమలపై చర్చించాలని తెలిపింది. సోమవారం విచారణలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు అఫడవిట్లు దాఖలు చేశాయి. ఢిల్లీ వాయుకాలుష్యానికి ప్రధాన కారణం పట్టణ అంశాలే అని కేంద్రం చెప్పడం విశేషం. పరిశ్రమలు, వాహనాల పొగ, రహదారి దుమ్ము వాయుకాలుష్యానికి ప్రధాన కారణమని, వ్యవసాయ వ్యర్ధాల పొగ కేవలం 10 శాతమే కారణమని కేంద్రం పేర్కొంది. వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను న్యాయస్థానానికి కేంద్రం అందజేసింది. దీనిలో స్టోన్ క్రషర్లను, కొన్ని రకాల విద్యత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి. వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. అవసరమైతే సంపూర్ణ లాక్డౌన్ విధించడానికి సిద్ధమని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
వాయుకాలుష్య నివారణకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని పేర్కొంది. లాక్డౌన్ మాత్రమే తక్షణం కొంత మేరకు ప్రభావం చూపించగలదని తెలిపింది. 'స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం కొంచెం మెరుగ్గా ఉంటుంది. లాక్డౌన్ కచ్చితంగా ఢిల్లీలోని వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. ఈ చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధం. అయితే ఎన్‌సిఆర్ రీజియన్‌లో అమలు చేయాలని కేంద్రం గానీ, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌గానీ ఆదేశించాలి' అని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఢిల్లీ మొత్తంగా రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు 69 మాత్రమే ఉండటంపై ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.