Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి బరితెగించిన ఏబీవీపీ.. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు
- మేమే దాడి చేశాం.. ఎవరైనా వస్తే ఇదే తీరు : ఏబీవీపీ వార్నింగ్
- జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ ఖండన
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో అధికార బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ మళ్లీ తెగబడింది. వర్సిటీలో మరోసారి హింసోన్మాదాన్ని సృష్టించింది. కాషాయపార్టీకి చెందిన విద్యార్థి నేతలు జరిపిన దాడిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఏబీవీపీ మూకలపై కేసు పెట్టకుండా.. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ నేతలపై కేసు పెట్టారు. గాయాల పాలైన వారు ఎయిమ్స్, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీఘోష్ తీవ్రంగా ఖండించారు. ''జేఎన్‌యూలో ఏబీవీపీ గూండాలు హింసను సృష్టించారు. ఈ అరాచకశక్తులు పదే పదే విద్యార్థులపై దాడి చేసి క్యాంపస్‌లో ఉన్న ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ ఇంకా మౌనంగా ఉంటుందా? గూండాలపై చర్యలు తీసుకోదా?'' అని ప్రశ్నించారు. హింసాకాండను ప్రేరేపించింది ఏబీవీపీనే అని చెప్పారు. మరో సంస్థ రిజర్వ్ చేసినప్పటికీ ఏబీవీపీ సభ్యులు దౌర్జన్యంగా.. ఆ స్థలంలో సమావేశాన్ని ప్రారంభించారని తెలిపారు. జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు తమ కార్యక్రమాన్ని వేరే చోటికి తరలించాలని ఏబీవీపీని కోరినప్పుడు, తమపై దాడి జరిగిందని వివరించారు. ఏబీవీపీకి చెందిన మూకలు.. సామాన్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారనీ, ఆ తరువాత విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు.
జేఎన్‌యూలోని స్టూడెంట్ యూనియన్ హాల్లో ఏ విద్యార్థి సంఘమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరుగుతాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అయితే నెల రోజుల కింద ఏబీవీపీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని, హాల్లో ఉన్న ఫోటోలు, ఇతర సామాగ్రిని పాడు చేశారు. ఫోటోలపై రంగులు పూసి ప్రజాస్వామ్య వాతావరణాన్ని నాశనం చేశారు. ఈ ఏడాదిలో మూడు సార్లు ఏబీవీపీ గూండాలు స్డూడెంట్ యూనియన్ హాల్‌ను ధ్వంసం చేశారు. దీంతో జేఎన్‌యూఎస్‌యూ ఒక నిర్ణయం తీసుకుంది. ''ఈసారి ఎవరైనా సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే, జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యులను సంప్రదించాలి. లేకపోతే వాట్సాప్ గ్రూప్లోనై విజ్ఞప్తి కోరి అనుమతి పొందాలి'' అని స్పష్టం చేసింది. దీనికి అన్ని విద్యార్థి సంఘాలు అంగీకరించాయి. అయితే యూనియన్ ఆఫీస్ గదిని రీడింగ్ సెషన్ కోసం నవంబర్ 14న బుక్ చేసినట్టు పబ్లిక్ డొమైన్లో ఉంచబడింది. ఆదివారం రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు హండ్రడ్ ఫ్లవర్స్ అనే విద్యార్థి గ్రూప్ అనుమతి పొంది, రెండు రోజులుగా ప్రచారం చేసుకొని, ఏర్పాట్లు చేసుకుంది. అయితే దీనికి ఎలాగైనా అంతరాయం కలిగించేందుకు ఏబీవీపీ కుట్ర పన్నింది. ఎలాగైనా ఘర్షణ పడాలని నిర్ణయించుకుంది. అందుకనే హండ్రడ్ ఫ్లవర్స్ గ్రూప్ సమావేశం ప్రారంభం అవ్వడానికి కొద్ది సేపు ముందే ఉద్దేశపూర్వకంగానే ఏబీవీపీ నేతలు.. ఆ హాల్లోకి చొరబడి సమావేశం నిర్వహించారు. హండ్రడ్ ఫ్లవర్స్ గ్రూప్ విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు హాల్లోకి వెళ్లారు. ఇక్కడ తాము సమావేశం ఏర్పాటు చేసుకుంటామని, ఖాళీ చేయాలని ఫ్లవర్ గ్రూప్ విద్యార్థులు ఏబీవీపీ సభ్యులను విజ్ఞప్తి చేశారు. ఇక్కడ నుంచి వెళ్లం..అంటూ వాదనకు దిగటమే కాదు. దాడికి యత్నించారు. విద్యార్థులపై కుర్చీలు ఎత్తారు. ఇనపరాడ్లతో దాడి చేశారు. ఆదివారం రాత్రి ఈ దౌర్జన్యకాండ జరిగిందని..తెలుసుకున్న జేఎన్‌యూఎస్‌యూ నేతలు, విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షణకు అక్కడికి చేరుకున్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఏబీవీపికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాల హౌరెత్తించారు. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఐఎస్)కు చెందిన విద్యార్థి వివేక్‌పై, ఏబీవీపీకి చెందిన రిషు ఇనప రాడ్‌తో బాదాడు. మరో కాషాయ విద్యార్థినేత రాఖోహౌరి బాగ్ చెక్క కుర్చీలతో రెచ్చిపోయాడు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ (ఎస్ఎస్ఎస్) మాజీ కౌన్సిలర్, విద్యార్థి ఉమేష్, ప్రబాంషుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ధనంజరు, అమన్, హరేంద్ర, లోకేంద్రలపై దాడి జరిగింది. ద్రిప్త, అఖ్తరిస్తాలను కాషాయమూకలు దుర్భాషలాడుతూ, హెచ్చరించారు. ఈ ఘటనలో చాలా మంది విద్యార్థులు గాయాలు పాలయ్యారు. విద్యార్థినులపై దాడులు, వేధింపులు వంటివి పాల్పడ్డారు. అవమానకరమైన, ద్వేషంతో కూడిన హెచ్చరికలను ఏబీవీపీ శ్రేణులు జారీ చేశాయి. తామే దాడి చేశామని, ఇంకా ఎవరైనా ముందుకొస్తే ఇదే శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.
దాడిలో తీవ్రంగా గాయాల పాలైన విద్యార్థులను ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు దాడి చేసినది ఏబీవీపీ గూండాలేనని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ నేతలపై వంసత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనికి కౌంటర్‌గా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా కేసు పెట్టింది. అయితే పోలీసులు ఏబీవీపీ నేతలు పెట్టిన కేసుపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. ఈ హింసను నిరసిస్తూ.. సోమవారం సాయంత్రం జేఎన్‌యూఎస్‌యూ ప్రజాస్వామ్య పరిరక్షణ మార్చ్‌కు నిర్వహించింది. మరోవైపు ఏబీవీపీ కూడా ప్రతిగా శాంతి మార్చ్ నిర్వహించటం గమనార్హం.