Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 600 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్
అహ్మదాబాద్ : గుజరాత్లో మళ్లీ హెరాయిన్ పట్టుబడింది. మోర్బీ జిల్లాలోని జింజుడా గ్రామంలో 120 కేజీల హెరాయిన్‌ను ఆ రాష్ట్ర యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీస్) స్వాధీనం చేసుకున్నది. దీని విలువ రూ. 600 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, ఈ కేసులో అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. హెరాయిన్‌కు సంబంధించిన సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి ఏటీఎస్ ఆపరేషన్‌ను చేపట్టింది. పాకిస్థాన్ బోటు నుంచి డెలివరీ అందిన తర్వాత సముద్ర మార్గం ద్వారా నిందితులు హెరాయిన్‌ను పట్టుకొచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని గుజరాత్ ఏటీఎస్ పేర్కొన్నది. '' పాకిస్థాన్‌కు చెందిన జహీద్ బషీర్ బెలోచ్ ఈ డ్రగ్‌ను పంపాడు. 2019లో 227 కేజీల హెరాయిన్ సీజ్‌కు సంబంధించిన కేసుతో సంబంధం ఉన్న ఈయన పరారీలో ఉన్నాడు'' అని ఏటీఎస్ వివరించింది. ఆఫ్రికాకు చెందిన ఒక దేశానికి సరఫరా చేయడానికి భారత్‌లోని స్మగ్లర్లకు ఈ హెరాయిన్ అందిందని పేర్కొన్నది. రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి గుజరాత్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని హెరాయిన్ సీజ్ విషయాన్ని ఆ రాష్ట్ర హౌం మంత్రి హర్ష సంఘవి వెల్లడించారు. '' గుజరాత్ ఏటీఎస్ గతేడాది రూ. 1320 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసింది. అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్‌లోకి మాదక ద్రవ్యాలు చేరుతున్నాయి'' అని విలేకరుల సమావేశంలో గుజరాత్ ఏటీఎస్ డీఐజీ హిమాన్షు శుక్లా వెల్లడించారు. కాగా, సెప్టెంబర్‌లో కుచ్లోని ముంద్రా పోర్టులో దాదాపు రూ. 21 వేల కోట్ల విలువ చేసే సుమారు మూడువేల కిలోగ్రాముల హెరాయిన్‌ను పట్టుబడిన విషయం విదితమే.