Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎస్‌లతో అప్‌గ్రేడ్ జాబితా ఇవ్వండి
- లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టు ధర్మాసనం
- రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు యూపీ సమ్మతి
- పరిహారం ఇవ్వలేదని పిటిషన్లు వచ్చాయ్ణి జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ మారణకాండపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో అందరూ లఖింపూర్ ఖేరీకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ల గ్రేడ్‌లోని అధికారులే ఎక్కువగా ఉన్నారనీ, కనుక సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ స్థానం సూచించింది. సిట్ చేర్చడం కోసం యూపీకి చెందని యూపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారుల పేర్ల జాబితాను నేడు (మంగళవారం) సాయంత్రంలోగా అందజేయాలనీ, రేపు (బుధవారం) ఆదేశాలు ఇస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు దర్యాప్తు పర్యవేక్షణకు యూపీకి చెందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించేందుకు యోగి ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం లఖింపూర్ ఖేరీ ఘటనపై పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ , న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. గత విచారణలో ధర్మాసనం సిట్ దర్యాప్తు, యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్‌పై నమ్మకం లేదనీ, అందువల్ల దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ పేర్లను కోర్టు సూచించింది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకుంటానని యూపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ధర్మాసనానికి తెలిపారు. సోమవారం విచారణ ప్రారంభించగానే యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ ''గత విచారణలో దర్యాప్తు పర్యవేక్షణకు యూపీకి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఆ సూచనలను తాను తీసుకుంటున్నాను. మీరు అనుకునే వారిని నియమించండి. ఏరాష్ట్రం, ఏ హైకోర్టు న్యాయమూర్తినైనా పరిగణించి నియమించవచ్చు'' అని తెలిపారు. దీనికి స్పందించిన జస్టిస్ ఎన్వి రమణ ''రాకేష్ కుమార్ జైన్నా? లేదా మరొక న్యాయమూర్తా? అని పరిశీలిస్తున్నాం. కనుక మాకు మరో రోజు అవసరం. మేం నియమించే న్యాయమూర్తితో మాట్లాడాలి'' అని అన్నారు. అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను అప్‌గ్రేడ్ చేయాలనీ, అందులో ఉన్నత స్థాయి అధికారులు ఉండాలని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ సిట్‌లో సబ్ ఇన్స్పెక్టర్, డీఎస్పీ స్థాయి అధికారుల్లో ఎక్కువ మంది లఖింపూర్ ఖేరీకి చెందిన వారేనని అన్నారు. దీనిపై ప్రక్రియ సాగుతుందనీ, అందుకే స్టేటస్ రిపోర్టు కూడా దాఖలు చేయలేదని న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు. ఇప్పటికే దర్యాప్తునకు ఒక ఉన్నత స్థాయి అధికారి సహకారం తీసుకుంటున్నామని అన్నారు. ''నేడు (మంగళవారం) సాయంత్రంలోగా తమకు యూపీకి చెందని, యూపీ కేడర్ ఐపీఎస్ అధికారుల పేర్లు జాబితా ఇవ్వాలి. రేపు (బుధవారం) మేము ఆదేశాలు జారీ చేస్తాం'' అని జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. అందుకు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అంగీకరించారు. సీనియర్ న్యాయవాది హర్షవీర్ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ ఎవరిని నియమించినా వారు సూపర్విజన్ చేయకూడదనీ, పర్యవేక్షణ చేయొచ్చని అన్నారు. దీనికి జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ''ఆ మాత్రం పరిజ్ఞానం మాకు ఉన్నది. క్రిమినల్ చట్టంలో కూడా జ్ఞానం ఉంది'' అని పేర్కొన్నారు. మృతి చెందిన బీజేపీ కార్యకర్త శ్యామ్ సుందర్ భార్య తరపు సీనియర్ న్యాయవాది అరుణ్ భరద్వాజ్ సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని కోరారు. దీనికి జస్టిస్ ఎన్వి రమణ ''మేం దానిని కూడా పరిశీలిస్తాం. మాకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో మాకు చాలా స్వేచ్ఛ ఉంది. మేం రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలను పరిగణిస్తాం. ఈ అసైన్మెంట్ను ఏ న్యాయమూర్తి అంగీకరిస్తారో చూద్దాం'' అని అన్నారు. ''మేం గత వారం పెగాసస్‌పై ఆర్డర్‌ను ఇచ్చాం. మేం రిటైర్డ్ జడ్జికి ఎంత జాగ్రత్తగా పనిని అప్పగించామో మీరు చూశారు. మేం పర్యవేక్షణ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేసాం'' అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు అనుమతి లేకుండా సిట్ చీఫ్ ఉమేష్ చంద్ర అగర్వాల్‌ని బదిలీ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిని కూడా పరిశీలిస్తామని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వలేదని కొన్ని పిటిషన్లు వచ్చాయని ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేని జస్టిస్ ఎన్వి రమణ ప్రశ్నించారు. దీనికి సాల్వే స్పందిస్తూ యూపీ ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గరిమా ప్రసాద్ దృష్టికి తీసుకెళ్తే ఆమె ఇప్పిస్తుందని అన్నారు. దీనికి ఏఏజీ గరిమా ప్రసాద్ స్పందిస్తూ ''అవును. తన దృష్టికి తీసుకొస్తే పరిహారం ఇప్పిస్తాం'' అని పేర్కొన్నారు.