Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీలపై దాడులను ఖండిస్తూ ఆందోళన
- శాఖలకు సీపీఐ(ఎం) పిలుపు
న్యూఢిల్లీ : మైనారిటీ కమ్యూనిటీలైన క్రైస్తవులు, ముస్లింలపై సంఘ పరివార్ అనుబంధ సంస్థల దాడులు పెరుగుతుండడం పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత మతోన్మాద సందేశాలను బీజేపీ నేతలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో, హింసను ఎలా రెచ్చగొడుతున్నారో ఫేస్బుక్లో ఇటీవల వెల్లడైన అంతర్గత పత్రాలు చూసినట్లైతే స్పష్టమవుతోంది. బాధితులకు రక్షణ కలి్పంచడానికి బదులుగా ఇటువంటి మతోన్మాద చర్యలకు పాల్పడేవారికి చట్టం నుంచి రక్షణ కల్పించబడుతోంది. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు బాధితులనే శిక్షిస్తున్నాయి. బాధితులకు మద్దతు ఇచ్చినవారిపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. నిరంకుశ క్లాజుల కింద అరెస్టులు చేస్తున్నారు.
మానవ హక్కుల గ్రూపులు ఇచ్చిన నివేదికలను చూసినట్లైతే ఈ ఏడాది మొదటి 9మాసాల్లో క్రైస్తవులపై, వారి ఆరాధనా స్థలాలపై 300దాడులు జరిగాయి. బాధితుల్లో చాలా మంది ఆదివాసీ, దళిత కమ్యూనిటీలకు చెందినవారే. ప్రార్ధనా సమావేశాలను క్రమం తప్పకుండా అడ్డగిస్తూనే వున్నారు. మతమార్పిడులను నివారించే పేరుతో ప్రార్ధనా సమావేశాల్లో పాల్గొన్నవారిని చితకబాదుతున్నారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ముస్లిం మైనారిటీ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. గో రక్షణ, లవ్ జిహాద్ పేరుతో వారిని వేధింపులకు గురిచేయడం, పోలీసు హత్యలు, బూటకపు అరెస్టులు, మూకుమ్మడి హింసకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి సంఘటనే త్రిపురలో చోటు చేసుకుంది. వీహెచ్‌పీ గూండాలు మైనారిటీ కమ్యూనిటీలపై దాడులకు తెగబడ్డారు. కొన్ని మసీదులను కూడా ధ్వంసం చేశారు. పైగా ఈ దాడుల గురించి చెప్పిన వారిపై ఉపా కింద కేసులు నమోదు చేశారు. ప్రార్ధనలు జరుపుకునే హక్కును నివారించడం మరో ఉదాహరణ. జాతీయ రాజధాని ప్రాంతంలోని గుర్గావ్లో ప్రార్ధనలు జరుపుకుంటున్న వారిని అడ్డగించారు. మధ్యప్రదేశ్‌లో కొన్ని చోట్ల ముస్లిం వీధి వ్యాపారస్తులపై బెదిరింపులకు దిగారు. వారి జీవనోపాధులను చేసుకోనివ్వకుండా అడ్డగించారు. అసోంలో, దశాబ్దాల తరబడి భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతు కుటుంబాలను దారుణంగా అక్కడ నుండి పంపివేశారు. కేవలం వారు ముస్లింలైనందునే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై ఎన్ఎస్ఏ ఉపయోగించడం చాలా సర్వసాధారణమై పోయింది. మైనారిటీలపై ఇలా దాడులు జరపడమంటే భారత రాజ్యాంగంపై దాడి చేయడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మతపరమైన మైనారిటీలపై, వారి రాజ్యాంగబద్ధమైన హక్కులపై దాడులకు నిరసనగా డిసెంబరు 1వ తేదిని నిరసన దినంగా పాటించాల్సిందిగా సీపీఐ(ఎం) తన శాఖలన్నింటికీ పిలుపునిచ్చింది.
ఆ ఆర్డినెన్స్‌లు రద్దు చేయండి: సీపీఐ(ఎం) డిమాండ్
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను జారీ చేయడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. పాలక పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళేందుకు ఒక రాజకీయ సాధనంగా సీబీఐ, ఈడీలు పనిచేస్తున్నాయని విమర్శించింది. ప్రతిపక్ష నేతలను ఎల్లప్పుడూ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది. ఈ సంస్థల స్వయంప్రతిపత్తిని మరింత ధ్వంసం చేసేందుకు, కీలకమైన అధికారులను మరింత సులభంగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ఈ చర్య ఉద్దేశించబడిందని పేర్కొంది. నవంబరు 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్‌లు జారీ చేయడం ఖండించదగినది. బీజేపీ ఎల్లప్పుడూ సాగించే ఆర్డినెన్స్ రాజ్యం ప్రజాస్వామ్య వ్యతిరేకమని పేర్కొంది. కొనసాగుతున్న దర్యాప్తుకు వెసులుబాటు కల్పించేలా, ఏ పదవీ కాలాన్నైనా పొడిగించడమంటే కేవలం స్వల్పకాల వ్యవధికే వుండాలని పైగా అత్యంత అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇది జరగాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కదారి పట్టించడమే ఈ ఆర్డినెన్స్‌ల ఉద్దేశమని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌లతో కేంద్ర ప్రభుత్వం ఏడాది చొప్పున మూడు పొడిగింపులను మంజూరు చేసింది. తక్షణమే ఈ ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈ ఆర్డినెన్స్‌లను పార్లమెంట్లో చట్టంగా మార్చడానికి చేసే ప్రయత్నాన్ని సీపీఐ(ఎం) ఎంపీలు వ్యతిరేకిస్తారని తెలిపింది.