Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగ్గుమంటున్న ధరలు.. జేబుపై అదనపు భారాలు
- ఐదు నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
- అక్టోబర్‌లో 12.54 శాతానికి డబ్లూపీఐ
న్యూఢిల్లీ : పేద, సామాన్య ప్రజలను దేశంలో అధిక ధరలు విలవిలలాడేలా చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఏకదాటిగా పెంచుతున్న పెట్రోలియం, డీజిల్ ధరల దెబ్బతో భారత్‌లో ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. కరోనా, లాక్డౌన్ సంక్షోభం, ఉపాధి కొరత, చాలిచాలని జీతాలు తదితర వాటితో ప్రజలు ఆర్థికంగా సతమతమవుతుంటే మరోవైపు అధిక ధరలు సామాన్యుల బతుకులను మరింత చిద్రం చేస్తోన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డ్ స్థాయిలో 12.54 శాతానికి ఎగిసింది. సోమవారం ప్రకటించిన ప్రభుత్వ గణంకాల ప్రకారం.. టోకు ద్రవ్యోల్బణం ఐదు మాసాల గరిష్టానికి చేరింది. వరుసగా ఏడో మాసంలోనూ రెండంకెల స్థాయిని నమోదు చేయడం ఆందోళనకరం. ఇంతక్రితం సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 10.66 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన అక్టోబర్‌లో వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) అంతకుముందు నెలతో పోలిస్తే 4.35 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగింది. ఇక ఆహార ద్రవ్యోల్బణం సైతం సెప్టెంబర్‌లో 0.68 శాతం నుంచి అక్టోబర్‌లో 0.85 శాతానికి ఎగిసింది. ఈ గణంకాలను ఆర్బీఐ అత్యంత కీలకంగా తీసుకుంటుంది. క్రితం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ 20.1 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్థి 9.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అధిక ధరలు ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీయనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్చు ద్రవ్యోల్బణంతో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. గడిచిన అక్టోబర్‌లో ముఖ్యంగా ముడి చమురు ధరలు, పెట్రోల్, డీజిల్, మినరల్ ఆయిల్స్‌తో పాటు తయారీ వస్తువుల ధరలు పెరగడంతో హెచ్చు టోకు ధరలకు ఆజ్యం పోశాయి. ఇంధన, విద్యుత్ ధరలు ఏడాదికేడాదితో పోల్చితే 37.18 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌లో ఇది 24.81 శాతం ఎగిసింది. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 11.41శాతం నుంచి 12.04శాతానికి చేరింది. అహారోత్ప త్తుల ధరలు 3.06 శాతం ప్రియమయ్యాయి. ఇంతక్రితం సెప్టెంబర్ మాసంలో 1.14 శాతంగా నమోదయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఎంపిసి భేటీ డిసెంబర్ 6-8 తేదిల్లో జరగనుంది. అధిక ధరల నేపథ్యంలో వడ్డీ రేట్లను సమీక్షించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై అమాం తంగా పెంచుతున్న పన్నుల భారం అధిక ధరలకు ఆజ్యం పోస్తోందని.. ఇకనైనా కట్టడి చేయకపోతే ప్రజల కొనుగోలు శక్తి అమాంతం హరించుకుపోయి.. దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.