Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైజర్, బయోఎన్‌టెక్, మోడర్నాలపై కొత్త విశ్లేషణలో వెల్లడి
న్యూఢిల్లీ : కరోనాను అడ్డం పెట్టుకుని వ్యాక్సిన్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఎలా ఆర్జిస్తున్నాయో ఒక విశ్లేషణలో వెల్లడైంది. ఫైజర్, బయోఎన్‌టెక్, మోడర్నా కంపెనీలు విజయం సాధించిన తమ కోవిడ్ టీకాల కారణంగా ప్రతి నిముషానికి ఉమ్మడిగా 65వేల డాలర్లు లాభాలు సాధిస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచంలోని నిరుపేద దేశాలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయని కొత్త విశ్లేషణలో వెల్లడైంది. ఈ కంపెనీలు పెద్ద మొత్తంలో టీకా డోసులను సంపన్న దేశాలకే విక్రయించాయి. దాంతో తక్కువ ఆదాయం గల దేశాలు టీకాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ (పివిఎ) పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లు విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు అందాలని ప్రచారం చేసే ఈ సంస్థ తాను స్వయంగా విశ్లేషించి, రూపొందించిన నివేదికల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించింది. 2021 సంవత్సరంలో ఈ మూడు కంపెనీలు ముందస్తు పన్ను లాభాలు ఆర్జించనున్నాయని అలయన్స్ అంచనా వేసింది. సెకనుకు వెయ్యి డాలర్లుకు పైగా, నిముషానికి 65వేల డాలర్లు, రోజుకు 9.35కోట్ల డాలర్లను ఆర్జిస్తున్నాయని పేర్కొంది. కేవలం కొద్ది కంపెనీలు ప్రతి గంటకూ ఇన్నేసి లక్షల డాలర్లు సంపాదిస్తుంటే మరోపక్క నిరుపేద దేశాల్లో కేవలం 2శాతం మంది జనాభా మాత్రమే పూర్తిగా టీకాలు వేయించుకున్నారని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ ఆఫ్రికా పేర్కొంది. ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల చర్యలకు విరుద్ధంగా ఈమూడు కంపెనీల చర్యలు వున్నాయి. లాభార్జన ధ్యేయంగా కాకుండా పై రెండు కంపెనీలు తమ టీకాలను అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయేవరకు ఈ ఏర్పాట్లను కొనసాగిస్తామని ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి.