Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్‌మంతర్ వద్ద డీవైఎఫ్ఐ ధర్నా
న్యూఢిల్లీ : త్రిపురలో మైనార్టీలపై దాడులు ఆపాలని డీవైఎఫ్ఐ ధర్నా చేపట్టింది. ''ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, మతోన్మాదాన్ని నశించాలి'' అంటూ త్రిపురకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం నాడిక్కడ జంతర్‌మంతర్‌వద్ద డీవైఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. త్రిపురలో మైనార్టీలు, వామపక్ష కార్యకర్తలపై దాడులు ఆపాలనీ, యూఏపీఏ రద్దు చేయాలని ప్లకార్డులు చేబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీమ్, అభరు ముఖర్జీలు మాట్లాడుతూ త్రిపురలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. వామపక్ష కార్యకర్తలపైన, కార్యాలయాలపైన దాడులు చేశారని దుయ్యబట్టారు. అలాగే మైనార్టీలపై దాడులు లౌకికవాదానికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో మైనార్టీలపై దాడులు పెరిగాయని, మైనార్టీలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయనీ, త్రిపురలో ఇటీవలి మైనార్టీలపై హింసకు పాల్పడ్డారని విమర్శించారు. ఆ ఘటనను రిపోర్టు చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపైన యూఏపీఏ కేసులు నమోదు చేశారనీ, అలాగే ఆ ఘటన నిజానిజాలు తెలుసుకునేందుకు వెళ్లిన న్యాయవాదులపైనా యూఏపీఏ కేసులు నమోదు చేశారని తెలిపారు.