Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానీ, అదానీ లాభాలే మోడీ ధ్యేయం
- సూర్యావతి శతజయంతి సభలో బృందా కరత్
అమరావతి : భారత పార్లమెంట్‌ను కార్పొరేట్ మందిరంగా మోడీ ప్రభుత్వం మార్చేసిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్ విమర్శించారు. ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నేత మానికొండ సూర్యావతి శతజయంతి సభలో ముఖ్యవక్తగా ఆమె పాల్గొని ఆమె ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి అధ్యక్షత వహించారు. 2014లో ప్రధాని మోడీ పార్లమెంటు మెట్లకు నమస్కారం చేస్తూ పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా చూస్తానని చెప్పిన విషయాన్ని కరత్ గుర్తుచేశారు. ఆ మందిరంలో ప్రధాన పూజారిగా ఉన్న మోడీ ప్రజాసేవను మరిచి, అంబానీ అంబానీ..అదానీ అదానీ..కార్పొరేట్ కార్పొరేట్... అనే మంత్రాలను జపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, దళిత, గిరిజన, మహిళలు, విద్యార్థుల, రాష్ట్రాల హక్కులన్నింటినీ హరిస్తూ కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెడుతోందన్నారు. వారి పూర్వీకులు బ్రిటీషు వారికి ఏజెంట్లుగా పనిచేయగా ఇప్పటి ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు జాతీయవాదం, దేశభక్తి పేరుతో కార్పొరేట్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. పితృస్వామిక సమాజాన్ని నిర్మించి, మనువాదాన్ని అమలు చేయాలని, మహిళలను ఇళ్లకే పరిమితం చేయాలని బీజేపీ తహతహలాడుతోందని అన్నారు. ఎస్సి, ఎస్‌టిల అభివృద్ధికోసం కేటాయించిన నిధులను కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకు కేంద్రం జనరల్ పూల్‌కు మళ్లిస్తోందన్నారు.