Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు మేధావులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు లేఖ
న్యూఢిల్లీ : కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు, జీవనోపాధితో ముడిపడిన పలు కేసుల విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని మేధావులు, విద్యావేత్తలు, పౌర హక్కుల నేతలు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అత్యంత కీలకమైన కేసుల విచారణ పూర్తిచేయటం ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు వారు లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఆర్టికల్ 370, ఎన్నికల బాండ్లు, సాగు చట్టాలు, ఉపా చట్టం...మొదలైన వాటిపై సుప్రీంలో దాఖలైన పిటిషన్ల విచారణ గత రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు గుర్తుచేశారు. అడ్మిరల్ (రిటైర్డ్) లక్ష్మీనారాయణ్ రామ్‌దాస్, సామాజిక కార్యకర్త మేధా పట్కార్, అణు శాస్త్రవేత్త డాక్టర్ ఎ.గోపాలకృష్ణన్, విద్యావేత్తలు ఎస్.అనిత, రాజ్‌మోహన్ గాంధీ... దాదాపు 200మందిపైగా ప్రముఖులు లేఖపై సంతకాలు చేశారు.జాతీయ ప్రయోజనాలు, పౌరుల ప్రాథమిక హక్కులతో ముడిపడిన కేసుల విచారణ వేగవంతం చేయాలని వారు కోరారు. లేఖలో వారు పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన 421 కసుల విచారణ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో 49 అత్యంత కీలకమైనవి. ఆర్టికల్ 370నిపార్లమెంట్లో ఏకపక్షం గా రద్దు చేయటం, ఉపా చట్టం దుర్వినియోగం, సీఏఏ చెల్లుబాటు, సాగు చట్టాలు...మొదలైన అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణ నత్తనడకన సాగుతున్నాయి. ఉదాహరణకు సాగు చట్టాలపై సుప్రీం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను ఈ ఏడాది మార్చిలోనే సమర్పించింది.
అయినప్పటికీ ఈ కేసు తదుపరి విచారణ ధర్మాసనం ముందుకు రావటం లేదు. అలాగే రాజద్రోహం చట్టం, పెగాసస్,ఆధార్, ఎన్నికల బాండ్లు, రాఫెల్ కుంభకోణం..ఇవి రాజకీయంగానూ అత్యంత కీలకమైనవి. వీటిపై సుప్రీంకోర్టులో విచారణ రెండెం డ్లుగా పెండింగ్‌లో ఉండటం మంచిది కాదని లేఖలో పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య కూడా 31కి పెరిగింది. జాతీయ ప్రయోజనాలు, పౌరుల ప్రాథమిక హక్కులు..వంటి అంశాలతో ముడిపడిన కేసుల పరిష్కారం వేగంగా ఉంటుందని భావించాం. కానీ అలా జరగటం లేదు. రెండేండ్లుగా కేసుల విచారణ నత్తనడకన సాగటం కోట్లాది కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. రాజ్యాంగ ధర్మాసనం వద్ద ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాల్సి వుంది. తద్వారా న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై ప్రజలకు మరింత విశ్వాసం ఏర్పడుతుంది.