Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికార అండతో పోలీసుల ఆగడాలు
- 20 ఏండ్లలో 1,888 కస్టోడియల్ మరణాలు
- 893 మంది పోలీసులపై కేసులు.. 26 మంది దోషులు
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికార నాయకుల అండతో పోలీసుల ఆగడాలు పెరుగుతున్నాయనీ, దీని కారణంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో గత మంగళవారం 22 ఏండ్ల అల్తాఫ్ పోలీసుల నిర్బంధంలో మరణించాడు. దీంతో మరోసారి పోలీసుల వ్యవహారం.. మరీ మఖ్యంగా యూపీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసుల తీరు చర్చనీయాంశం అవుతోంది. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన కేసులో అల్తాఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్తాఫ్ టాయిలెట్లో నేల నుండి కేవలం రెండు అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ పైపును ఉపయోగించి తన జాకెట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై సర్వత్రా ప్రజాగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో శాఖాపరమైన, మెజిస్ట్రేరియల్ విచారణ ఏకకాలంలో జరుగుతున్నదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న కాస్గంజ్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు.
అయితే, ఈ తరహా ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయనే అందోళన వ్యక్తమవుతోంది. అధికారపార్టీ నేతల అండతో నిందితులను తీవ్రంగా హింసించి ప్రాణాలు పోవడానికి కారణమైనవారు తప్పించుకుంటున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. గత 20 ఏండ్లలో దేశవ్యాప్తంగా 1,888 కస్టోడియల్ మరణాలు నమోదయ్యాయి.
వీటికి సంబంధించి పోలీసు సిబ్బందిపై 893 కేసులు నమోదయ్యాయి. అలాగే, 358 మంది సిబ్బందిపై చార్జిషీట్లు నమోదు చేయబడ్డాయి. అయితే ఈ కాలంలో కేవలం 26 మంది పోలీసులు మాత్రమే దోషులుగా తేలినట్టు అధికారిక రికార్డులు పేర్కొంటున్నాయి. ఇక కస్టోడియల్ మరణాలకు సంబంధించి 2006లో మొత్తం 11 మంది పోలీసులు దోషులుగా తేలగా, అందులో ఏడుగురు ఉత్తరప్రదేశ్‌కు, నలుగురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. ఇక 2020లో 76 పోలీసు నిర్బంధ మరణాలు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్లో అత్యధికంగా 15 మరణాలు నమోదయ్యాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 45 కేసులు నమోదుకాగా, 8 చార్జిషీట్లు దాఖలయ్యాయి. అయితే, వీటికి సంబంధించి గతేడాది ఎవరికీ ఎలాంటి శిక్షలు పడలేదు. గత నాలుగేళ్లలో కస్టడీ మరణాలకు సంబంధించి 96 మంది పోలీసులను అరెస్టు చేశారు. అయితే, అంతకు ముందు సంవత్సరాల డేటా అందుబాటులో లేదు. అయితే, 2001 నుంచి రిమాండ్‌లో లేని కేటగిరీ కస్టడీ మరణాలు 1,185, రిమాండ్‌లో ఉన్న వ్యక్తుల కేటగిరీలో 703 నివేదించబడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో కస్టడీ మరణాలకు సంబంధించి పోలీసు సిబ్బందిపై నమోదైన 893 కేసుల్లో 518 రిమాండ్‌లో లేని వాటికి సంబంధించినవి ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితులపై యూపీ, అసోంలో డీజీపీగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. పోలీసుల పనిలో లోపాలు గుర్తించి సరిదిద్దాల్సిన అవసరముందని అన్నారు. ''పోలీసులు ఈ తరహా కేసులను సరిగ్గా విచారించరు. వారు తమ సహౌద్యోగులను రక్షించడానికి ప్రయత్నిస్తారు, ఇది ఖచ్చితంగా తప్పు. ఒక వ్యక్తి కస్టడీలో చనిపోయినప్పుడు, బాధ్యుడైన వ్యక్తి బాధ్యత వహించాలి అతనికి శిక్షపడేలా పోలీసులు నడుచుకోవాలి'' అని సింగ్ అన్నారు.