Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల వెలువడిన ప్రపంచ స్థాయి ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం పడిపోవటంపై మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ దేశంలో దిగజారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అద్దంపడుతున్నాయని, ప్రజాస్వామ్య హక్కులకు ప్రమాదం పొంచివుందన్న సంగతి తెలుపుతున్నాయని వారు అన్నారు. 'కానిస్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్'(సీసీజీ)గా పిలవబడుతున్న మాజీ సివిల్ సర్వెంట్స్ గ్రూప్ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ ర్యాంక్ పడిపోవటంపై సమీక్ష చేసుకోవాల్సిన కేంద్రం, అలా చేయకపోగా..నివేదికల్నే తప్పుబడుతోందని వారు అన్నారు. ఈ ప్రకటనలో సీసీజీ పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆకలి సూచిక-2021లో భారత్ 101ర్యాంక్‌లో ఉండటాన్ని కేంద్రం తప్పుబట్టింది. అశాస్త్రీయమైన పద్ధతిలో ర్యాంకింగ్స్ విడుదల చేశారని భారత ప్రభుత్వం విమర్శించింది. 2015లో 55వ స్థానంలో ఉన్న భారత్ నేడు 101 స్థానానికి పడిపోవటం చర్చనీయాంశమైంది. యూరప్‌లోని ప్రఖ్యాత ఎన్జీఓ సంస్థలు ఈ సూచికను రూపొందించాయి. ఆ ఎన్జీఓ సంస్థలు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు కలిగిలేవని మాజీ సివిల్ సర్వెంట్స్ గ్రూప్(సీసీజీ) గుర్తుచేసింది. నిష్పాక్షికంగా ర్యాంకింగ్స్‌ను ఇచ్చాయని పేర్కొన్నది. ప్రపంచ ఆకలి సూచికలో విడుదలైన అంశాలే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో, సీఎంఐఈ, ఇతర పరిశోధనల్లోనూ బయటపడ్డాయని సీసీజీ పేర్కొన్నది. జీవన ప్రమాణం, విద్య, తలసరి ఆదాయంపై ఐరాస నివేదికలోనూ భారత్ ర్యాంక్ పడిపోయిందని సీసీజీ తెలిపింది. 189దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, గత ఏడాదిలో భారత్‌కు131వ స్థానం వచ్చింది. అలాగే లింగభేదం నివేదికలోనూ భారత్ 28స్థానాలు దిగజారి 140వ ర్యాంక్‌ను పొందింది. పొరుగున వున్న బంగ్లాదేశ్‌కు 65వ ర్యాంక్ దక్కింది.