Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధునిక క్యూబా నిర్మాత ఫిడెల్ కాస్ట్రో
- క్యూబాకు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం : ఫిడెల్ కాస్ట్రో ఐదో వర్థంతి సభలో ఏచూరి
- సోషలిజంపై దాడి : డి.రాజా
- ఫిడెల్కు ముందుచూపు ఎక్కువః క్వాన్ కార్లోస్
- ఆకట్టుకున్న ఫిడెల్ ఫోటో ఎగ్జిబిషన్
న్యూఢిల్లీ : క్యూబా సోషలిజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా సామ్రాజ్యవాదం నిరంతరం కుట్ర పన్నుతున్నదనీ, అయితే 60 ఏండ్లకు పైగా అమెరికా ఎన్నో కుట్రలు చేసినా.. విజయవంతం కాలేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అమెరికాకు 90మైళ్ల దూరంలో ఉన్న క్యూబా ఏనాడు భయపడ లేదనీ, అమెరికాను ఎదిరించి నిలిచిందని స్పష్టం చేశారు. ఫెడిల్ కాస్ట్రో ఆధునిక క్యూబాని నిర్మించారని గుర్తు చేశారు. క్యూబాకి ప్రపంచ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం నాడిక్కడ స్థానిక హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో సోషలిజం క్యూబా జాతీయ కమిటీ, అఖిలభారత శాంతి, సంఘీభావం సం ఘం ఆధ్వర్యంలో క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఐదో వర్థం తి జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయా సంఘాల నేతలు ఆర్. అరు ణ్ కుమార్, పల్లబ్‌సేన్ గుప్తా, దేవరాజన్‌లు అధ్యక్షత వహించారు. ఏచూరి మాట్లాడుతూ అమెరికా కుట్రలను క్యూబా సోషలిజం అధిగమించిందని తెలిపారు. కరోనా సమయంలో కూడా క్యూబాకు మందుల తయారీకి అవసరమైన ముడిసరుకు, ఆహార ధాన్యాలు దిగుమతి కాకుండా అమెరికా అడ్డుకున్నదని విమర్శించారు. కానీ అలాంటి పరిస్థితులను కూడా క్యూబా అధిగమించిందని స్పష్టం చేశారు. సొంతంగా మెడిసిన్‌ను తయారీ చేసుకున్నదని తెలిపారు. అంతేకాదు ప్రపంచంలోని 50 పైగా దేశాలకు మందులు, డాక్టర్లను పంపించి ఆదుకున్నదని గుర్తు చేశారు. వ్యాక్సిన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా సొంతంగానే తయారు చేసిందనీ, ఇప్పటికే 80 శాతం ప్రజలకు రెండు డోసులు వేసిందని తెలిపారు. టీకా ఉచితంగా ప్రజలందరికీ అందిస్తోందని వివరించారు. ఫెడిల్ కాస్ట్రో హయాంలో..పది మంది అమెరికా అధ్యక్షులను చూశారనీ, ఆయనను హత్య చేసేందుకు సీఐఏ 600పైగా కుట్రలు పన్నిందని తెలిపారు. ఫెడిల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చేనాటికి క్యూబా వెనుకబడి ఉందనీ, సోషలిజం అభివృద్ధితో ఆధునిక క్యూబాను ఫెడిల్ నిర్మించార ని తెలిపారు. జాత్యాంహకరం రద్దు, మహిళా సమానత్వం, అక్షరాస్యత వంటి వాటితో క్యూబాని అభివృద్దివైపు నడిపించారని గుర్తు చేశారు. సైన్స్, వైద్యరంగాల్లో అద్భుత విజయాలు సాధించారని తెలిపారు. క్యూబాకు సీపీఐ(ఎం) 20 వేల టన్నుల ఆహారధాన్యాలు పంపించినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రపంప వ్యాప్తంగా క్యూబాకు సంఘీభావం ఉన్నదనీ, ఇటీవలే విదేశాల్లో ఉండే ఇండియన్ కమ్యూనిస్టు శ్రేణులు 20 వేల ఫౌండ్లు క్యూబాకు అందించారని తెలిపారు. క్యూబా పట్ల ట్రంప్ విధానాలని బైడెన్ కూడా కొనసాగిస్తున్నాడని విమర్శించారు.ఫెడిల్కు ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఉందనీ,అదే క్యూబాని సోషలిజం వైపు నడిపించిదని అన్నారు.క్యూబాకు సంఘీభావం కొనసాగిస్తామనీ, భారతదేశ ప్రజల ఎల్లప్పుడూ క్యూబాతోనే ఉంటారని తెలిపారు. ఫెడిల్ను భారత దేశం గుర్తించుకుంటుందని అన్నారు.
ఫిడెల్కు ముందుచూపు ఎక్కువః క్వాన్ కార్లోస్
ఫిడెల్ కాస్ట్రోకు ముందుచూపు ఎక్కువని క్యూబా రాయబారి క్వాన్ కార్లోస్ అన్నారు. అందుకే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వాతావరణ మార్పులు గురించి, ఫిడెల్ 1992లో బ్రెజిల్ సమావేశంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆయన భౌతికంగా మనతో లేరని, అంతేతప్ప ఆయనెప్పుడూ తమతోనే ఉన్నారని క్యూబా ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.ఆయనెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించేవారని అన్నారు.ఎన్ని సవాళ్లు, సమస్యలు నైనా ఎదుర్కొంటామని, అలాగని స్వాతంత్య్రంతో పొందిన తమ సిద్ధాంతాలను, విధానాలను వదులుకోమని స్పష్టం చేశారు. తాము సొంతంగా వ్యాక్సిన్స్‌ను ..అభివృద్ధి చేసుకున్నామనీ, ఇప్పటికే మూడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయని, మరో రెండు వ్యాక్సిన్లు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. తమ వ్యాక్సిన్లు 93 శాతం రక్షణ కల్పిస్తాయని, రెండేండ్లపైబడిన చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. ఈఏడాది చివరి నాటికి వందశాతం వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు. క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా దుష్ప్రచారం చేస్తుందనీ, వాటిని తిప్పికొడుతున్నామని చెప్పారు. అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొని, క్యూబా ఆర్థిక బలోపేతం కోసం ప్రయత్నిస్తుం దని తెలిపారు. ఫెడిల్ కాస్ట్రో త్యాగాలు చేశారని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఫెడిల్కు ఇండియాతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.
సోషలిజంపై దాడిః డి.రాజా
క్యూబాపై దాడి చేయడమంటే, సోషలిజంపైన దాడిగా తాము పరిగణిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. యూఎన్ అసెంబ్లీలో క్యూబాపై నిర్బంధ ఆంక్షలను వ్యతిరేకిస్తూ అందరూ ఓటు వేశారనీ, అందుకు భిన్నంగా కేవలం యూఎస్ఏ, ఇజ్రాయిల్ మాత్రమే ఓటు వేశాయని గుర్తు చేశారు. అంతర్జాతీయ సమాజం ఆలోచనలను యూఎస్ఏ పట్టించుకోలేదని అన్నారు. చిన్న దేశమైన క్యూబా సోషలిజాన్ని నమ్మి పని చేస్తున్నదని తెలిపారు. ఫిడెల్ విద్యా, ఆరోగ్యం, ప్రాథమిక హక్కులు వంటివి ప్రజలకు ఇచ్చారని, సమానత్వ వ్యవస్థను సృష్టించారని వివరించారు. క్యూబా సోషలిజ ఆలోచనలపై అమెరికా దాడి చేస్తుందని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని క్యూబా ఎదిరించిందని తెలిపారు. సోషలిజం కోసం ప్రాణాలు సైతం వదిలేందుకు క్యూబా ప్రజలు కట్టుబడి ఉన్నారని అన్నారు. క్యూబాను ఏశక్తి ఆపలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు, ఎంఎ బేబి, సీపీఐ(ఎం) కేంద్ర కార్యవర్గ సభ్యులు జోగేంద్ర శర్మ, సోషలిజం క్యూబా జాతీయ కమిటీ నేత సోనియా గుప్తా, ఐద్వా కోశాధికారి ఎస్.పుణ్యవతి, ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్, ఐద్వా ఢిల్లీ కార్యదర్శి ఆశాశర్మ, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు ఎఎ రహీమ్, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీఘోష్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్, ఎస్ఎఫ్ఐ కార్యవర్గ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ విద్యార్థులు గీతాలపన చేశారు. అలాగే ఫిడెట్ కాస్ట్రో గురించి డాక్యుమెంటరీ వేశారు. క్యూబా రాయబారి కార్యాలయం వారు ఫిడెల్ కాస్ట్రో స్మరించుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆయన పాల్గొన్న సమావేశాలు, కార్యక్రమాలు ఫోటోలను ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ ఫోటోల సందర్భం గురించి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాలకు క్యూబా రాయబారి క్వాన్ కార్లోస్ వివరించారు.