Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా సంస్థల్లో దళితులపై అణచివేత
- ఆదుకోని చట్టాలు, పోలీసు : సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు
- దీపా మోహనన్ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది..
న్యూఢిల్లీ : విద్యాసంస్థల్లో కుల వివక్షకు ఎంతోమంది విద్యార్థులు బలవుతున్నారు. హైద్రాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనకు జరిగిన అన్యాయంపై కేరళలో దీపా పి.మోహనన్ అనే దళిత పీహెచ్డీ విద్యార్థిని నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది. దళితురాలినని తన పీహెచ్డీ అధ్యయానికి అనేక అడ్డంకులు సృష్టించారని ఆమె ఆరోపించారు. ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ (ఐఐయూసీఎన్ఎన్) ప్రొఫెసర్ కాలారికల్ను విధుల నుంచి తొలగించిన తర్వాతే ఆమె తన నిరాహార దీక్షను విరమించారు. విద్యాసంస్థల్లో దళితులు కుల వివక్షకు గురవుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి రావటం లేదని, చట్టాలు, పోలీసు వ్యవస్థ వివక్షను అడ్డుకోలేకపోతున్నాయని మేధావులు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'హరిరామ్ బాంభీ వర్సెస్ సత్యనారాయనన్' (2021)కేసులో సుప్రీంకోర్టు సైతం ఇదేరకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీలపై కులపరమైన దాడులు, వివక్ష ఇంకా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆధునిక సమాజంలోనూ కొనసాగుతున్నాయని చెప్పింది. సరైన పోలీస్ విచారణ లేక అనేక ఘటనలు వెలుగులోకి రావటం లేదని, కనుమరుగు అవుతున్నాయని తెలిపింది. కుల వివక్షను ఎదుర్కొంటూ ఎం.ఫీల్, పీహెచ్డీ పరిశోధన పూర్తిచేయడా నికి దశాబ్దకాలంగా పోరాడుతున్న దీపా.పి.మోహనన్‌ను చట్టాలు, నిబంధనలు ఏవీ ఆదుకోలేక పోయాయి. చివరికి ఆమె ఐఐయూసీఎన్ఎన్ వర్సిటీ గేటు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది.
న్యాయవ్యవస్థ ఏమంటోంది?
అంటరానితనం, కుల వివక్షను రూపుమాపడానికి పాలకులు..పౌర హక్కుల చట్టం, ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్, అట్రాసిటీ) యాక్ట్(దీనిని 'పీఓఏ' అని కూడా అంటారు), పీఓఏ యాక్ట్, నిబంధనావళి-1995, స్కావెంజర్స్, రిహాబిలిటేషన్ చట్టం.. అనే నాలుగు చట్టాల్ని తీసుకొచ్చారు. పౌర హక్కుల చట్టం దేశంలోని కుల వివక్షను అడ్డుకోలేకపోతున్నదని 1989లో ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) యాక్ట్‌ను తీసుకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నవారంతా దాదాపు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. వీరి హక్కుల్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం 2013లో స్కావెంజర్స్, రిహాబిలిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది.
అయితే ఈ చట్టాలు, అట్రాసిటీ నిబంధనలు..దీపా పి.మోహనన్ విషయంలో పనిచేయలేదు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవాల్ని తేల్చి పోలీసులు తమ విచారణను 60 రోజుల్లోగా పూర్తిచేయాలి. ఆ నివేదికను జిల్లా ఎస్సీకి అందజేయాలి. పోలీసులు చార్జ్‌షీట్ నమోదుచేశాక కోర్టులో విచారణ 2నెలల్లోగా పూర్తికావాలి. క్షేత్రస్థాయిలో ఇవేవీ జరగలేదు. చట్టాలు, అందులోని నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు అంటున్నారు. చివరి ప్రయత్నంగా ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు.