Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారిద్య్రంతో చనిపోయే వారే ఎక్కువ
- తాజా విశ్లేషణలో వెల్లడి
బెంగళూరు : గతేడాది నిరుద్యోగం, పేదరికం, దివాలా తీయడం, రుణాల ఊబిలో కూరుకుపోవడం వంటి కారణాలతో 10,600మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో ఇవే కారణాలతో మరణించిన 9,881మందితో పోలిస్తే ఈసారి మరణాల రేటు 8శాతం పెరిగింది. ఈ విషయంలో ప్రభుత్వ తాజా గణాంకాలు పరిశీలించినట్లైతే ఇవే కారణాలతో సగటున ప్రతి గంటకూ ఒకరి కన్నా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తాజా విశ్లేషణలో వెల్లడైంది. 2019లో దివాళా తీయడం, రుణ బాధలతో 5,908మంది మరణించారు. 2020కి వచ్చేసరికి ఈ సంఖ్య 5,213కి తగ్గింది. కానీ దారిద్య్రం, నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. దివాళా తీయడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం 11శాతం తగ్గితే దారిద్య్రం వల్ల చనిపోతున్న వారి రేటు ఏకంగా 69శాతం పెరిగింది. ఉపాధి కోల్పోయి నిరాశతో చనిపోయినవారి సంఖ్య కూడా 24శాతం పెరిగింది. 2019లో ఈ సంఖ్య 2851గా వుండగా, 2020లో 3548కి పెరిగింది. గతేడాది మొత్తంగా సంభవించిన ఆత్మహత్యల్లో దాదాపు సగం మంది అంటే 49శాతం మంది దివాళా, రుణ బాధలతోనే చనిపోయారు. మూడోవంతుమంది నిరుద్యోగ కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పేదరికంతో 1901మంది మృత్యువును ఆహ్వానించారు. అప్పటివరకు చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతున్న వారు కూడా కరోనా మహమ్మారి కారణంగా ఒక్కసారిగా అనిశ్చితికి లోనయ్యారు. ఈ తరహా ఆత్మహత్యలు ఏడు శాతం వరకు నమోదయ్యాయి. అలక్ష్యం, సామాజిక కళంకం (మానసిక ఆరోగ్యానికి సంబంధించిన) వంటి కారణాలతో చాలా మంది చికిత్స తీసుకోకుండా వుంటున్నారని, ఇటువంటి కేసుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైనపుపుడు వారు ఆత్మహత్యల వైపు ప్రేరేపితులవుతున్నారని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎక్కువమంది 30-44 ఏళ్ళ వయస్సులో వారేనని విశ్లేషణలో వెల్లడైంది. ఆ తర్వాత స్థానం 18-29 ఏళ్శ వయస్సులోని వారిదేనని పేర్కొన్నారు.
18ఏళ్ళకి తక్కువ, 60ఏళ్ళకి పైన వారు ఇటువంటి విపరీత చర్యలకు పాల్పడ్డం చాలాతక్కువగా వుంది. పైగా ఈ ఆత్మహత్యల్లో దాదాపు 70శాతం మంది అంటే 7,415మంది నాలుగు దక్షిణాది రాష్ట్రాలు కర్నాటక, తెలంగాణా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారే కావడం గమనార్హం. ఇక దివాళా తీయడం వల్ల చేసుకున్న ఆత్మహత్యల్లో ప్రతి పదింటిలో దాదాపు 9 ఈ నాలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి.