Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి కల్లా బిడ్ల అహ్వానం : దీపమ్ సెక్రెటరీ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలను వరుస పెట్టి అమ్మే పనిలో మోడీ సర్కార్ తీవ్రంగా నిమగమై ఉందని స్పష్టమవుతున్నది. అతి త్వరలోనే ఐదు నుంచి ఆరు పిఎస్యులను విక్రయించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రెటరీ తూహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. వీటి విక్రయానికి వచ్చే డిసెంబర్ - జనవరి మధ్య కాలంలో ఫైనాన్సియల్ బిడ్లను అమోదించనున్నామని తెలిపారు. బుధవారం ఆయన సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్లో మాట్లాడుతూ 19 ఏండ్ల తర్వాత తొలి సారి ఐదారు పీఎస్యూల ప్రయివేటీకరణ జరుగుతుందన్నారు. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), పవన్ హాన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, నిలాచల్ ఇస్పాట్ నిగమ్ సంస్థలున్నాయన్నారు. వీటిని ప్రభుత్వం ప్రయివేటీకరించే పనిలో ఉందన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను విక్రయించడంలో కేంద్రం చాలా ఆసక్తిగా ఉందన్నారు. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ముగ్గురు బిడ్డర్లు ఆసక్తి చూపారని వెల్లడించారు. అయితే ఆయా కార్పొరేట్ కంపెనీల వివరాలను ఆయన ప్రకటించలేదు. పీఎస్యూల విక్రయ ప్రక్రియను మంత్రులు, ఉన్నతాధికారులు వేగంగా సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రయివేటీకరణను సులభతరం చేసే అంశంలో క్యాబినెట్ సెక్రెటరీ కూడా త్వరలోనే ఓ సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు.