Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాల్లో గ్రామాల్లో మొబైల్ సేవలు అందించేందుకు యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ (యుఎస్వోఎఫ్) పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి మోడీ నేతత్వంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. యుఎస్వోఎఫ్ పథకం కింద ఐదేండ్ల కార్యాచరణతో ఆంధప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోని 44 వెనుకబడిన జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్లు అంచనా వ్యయం 4జీ ఆధారిత మొబైల్ సేవలను అందించనున్నారు. ప్రాజెక్టుకు యుఎస్వోఎఫ్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఒప్పందంపై సంతకం చేసిన తరువాత 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి అవుతుంది. 2023 నవంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశముంది. ఆయా జిల్లాల్లో గుర్తించిన గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను అందించడానికి సంబంధించిన పని ప్రస్తుతం యుఎస్వోఎఫ్ విధానాల ప్రకారం బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా ఐదు రాష్ట్రాలలోని ఆకాంక్షాత్మక జిల్లాల్లోని మారుమూల, కష్టతరమైన ప్రాంతాలలో మొబైల్ సేవలను అందించడానికి ప్రస్తుత ప్రతిపాదన, స్వయం విశ్వాసం కోసం ఉపయోగపడే డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. సమాచారం, విజ్ఞాన వ్యాప్తిని సులభతరం చేస్తుంది.
ఏపీలో 1,218 గ్రామాల్లో మొబైల్ సేవలు
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలో 1,218 గ్రామాల్లో మొబైల్ సేవలు అందించనున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని 1,054 గ్రామాలు, విజయనగరంలోని 154 గ్రామాలు, కడప జిల్లాలోని 10 గ్రామాల్లో మొబైల్ సేవలు అందిస్తామని అన్నారు. అందుకోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 699, జార్ఖండ్ 827, మహారాష్ట్ర 610, ఒడిశాలోని 3933 గ్రామాల్లో మొబైల్ సేవలు అందిస్తామని అన్నారు.
2022 వరకు పీఎంజీఎస్‌వై కొనసాగింపు
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని 2022 సెప్టెంబర్ వరకు కొనసాగించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. మైదాన ప్రాంతాల్లో 500 పైబడి, ఈశాన్య, హిమాలయా రాష్ట్రాల్లో 250 పైబడి జనాభా ఉన్న నివాశాలకు రోడ్డు అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్‌వైని ప్రారంభించింది. అలాగే ఎంపిక చేసిన మావోయిస్టు బ్లాక్‌ల్లో 100పై జనాభా ఉన్న నివాసాలకు రోడ్డు అనుసంధానం చేయాల్సి ఉంది. 2,432 ఆవాసాల్లో రోడ్ల అనుసంధానం చేయాల్సి ఉంది. మంజూరైన 6,45,627 కిలో మీటర్ల పొడువు రహదారి, 7,523 వంతెనల్లో 20,950 కిలో మీటర్ల రహదారి, 1,974 వంతెనలు పూర్తి కావాల్సి ఉంది.అలాగే, 50 వేల కిలో మీటర్ల గ్రామీణ రహదారుల నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భావించారు.
2023 వరకు (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ) కొనసాగింపు
లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల(ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ) రోడ్ల నిర్మాణం ప్రాజెక్టును 2023 మార్చి వరకు కొనసాగించడానికి సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రాష్ట్రాల్లో 44 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో రహదార్లు నిర్మాణం మెరుగుపరచడానికి 2016లో ప్రారంభించిన లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ కింద 5,714 కిలో మీటర్ల పొడవు రహదారి, 358 వంతెన పనులు పూర్తి కావల్సివుంది.
అలాగే మరో 1,887 కిలో మీటర్ల రహదారి పొడవు, 40 వంతెనలు మంజూరు అయ్యాయి. కమ్యూనికేషన్, భద్రతా కోణం నుండి చాలా కీలకమైన ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ఈ పథకం 2023 మార్చి వరకు పొడిగించారు.