Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ మారణకాండపై జరుగుతున్న దర్యాప్తు పర్యవేక్షణ కోసం పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ జైన్‌ను అత్యున్నత న్యాయస్థానం నియమించింది. అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీ మారణకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణకు ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా రాసిన లేఖను ఆధారంగా విచారణ సుప్రీం కోర్టులో కొనసాగుతుంది. బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లీలతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పర్యవేక్షణ ఆదేశాలు ఇచ్చింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు న్యాయంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉండేలా రిటైర్ట్ హైకోర్టు న్యాయమూర్తి నియామకం జరిగిందని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా చేర్చినట్టు ధర్మాసనం పేర్కొంది. ''ఐపీఎస్ అధికారులు ఎస్బి శిరోద్కర్, ప్రీతిందర్ సింగ్, పద్మజా చౌహాన్ ఈ ముగ్గురు పోలీసు అధికారులు సిట్‌లో ఉంటారు. దీంతో సిట్ పునర్నిర్మించడం అయింది. తాము నియమించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత, మాజీ న్యాయమూర్తి స్టేటస్ రిపోర్టు సమర్పించాలి. అప్పుడు ఈ కేసు విచారణ జాబితా చేస్తాం'' అని సీజేఐ జస్టిస్ ఎన్వీ. రమణ పేర్కొన్నారు.
''ఈ నెల 8, 12, 15 తేదీల్లో జరిగిన విచారణ సందర్భంగా కొంత మంది న్యాయవాదులు కొనసాగుతున్న దర్యాప్తులో న్యాయం గురించి ప్రశ్నించారు. దీంతో దర్యాప్తు పర్యవేక్షణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తిని, సిట్‌లో కొత్త సభ్యులను నియమిస్తామని ప్రతిపాదించాం. దీనికి ఉత్తరప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అంగీకరించారు. దీంతో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్‌ను నియమించాం'' అని ఆదేశాల్లో పేర్కొన్నారు. ''సిట్‌లో ఎక్కువ మంది లఖింపూర్ ఖేరీకి సంబంధించిన స్థానిక అధికారులే ఉండటంతో కొత్త సభ్యులను నియమించాం. ఈ కొత్త సిట్ స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు నిర్వహించాలి. దీన్ని మాజీ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారు. సిట్ దర్యాప్తును ముగించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందించాలి'' అని పేర్కొన్నారు.
జస్టిస్ రాకేష్ కుమార్ జైన్
జస్టిస్ రాకేష్ కుమార్ జైన్ 1958 అక్టోబర్ 1న హర్యానాలోని హిసార్‌లోని న్యాయవాదుల కుటుంబంలో జన్మించారు. తండ్రి గులాబ్ సింగ్ జైన్ ప్రముఖ ఆదాయపు పన్ను న్యాయవాది. 1972 నుంచి 1977 వరకు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ జైన్ బికాంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఎల్ఎల్బి చేశారు. 1982 మేలో చండీగఢ్‌లోని బార్ కౌన్సిల్ ఆఫ్ పంజాబ్, హర్యానాలో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1983 జనవరిలో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ అంశాలపై 25 ఏండ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. రెండుసార్లు హైకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా కొనసాగారు. క్రీడలపై ఆసక్తి ఉన్న జైన్ కాలేజీలో క్రికెట్ బాగా ఆడేవారు. అతను 2007 డిసెంబర్ 5న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2020 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు. బుధవారం సుప్రీం కోర్టు లఖింపూర్ ఖేరీ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు పర్యవేక్షణకు జస్టిస్ రాకేష్ కుమార్ జైన్‌ను నియమించింది.