Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో షేర్‌పై రూ.586 నష్టం
- లిస్టింగ్ రోజే కుప్పకూలిన సూచీ
- రూ.38వేల కోట్ల సంపద ఫట్
ముంబయి : వన్ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటియం తన ఐపిఒ ద్వారా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తొలి రోజే గురువారం ఆ సూచీ 27 శాతం కుప్పకూలిపోయింది. ఒక్క పూటలోనే మదుపరి ఒక్కో షేర్‌పై దాదాపు రూ.586 నష్టపోయారు. ఐపిఒలో ఒక్కో షేరు విలువను రూ.2,150గా నిర్ణయించింది. దీని ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపిఒ కావడం విశేషం. లిస్టింగ్ తొలి రోజు బిఎస్ఇలో ఇంట్రాడేలో 1,564 కనిష్ట స్థాయికి పడిపోయింది. ఉదయం 9 శాతం క్షీణతతో రూ.1,955 వద్ద సూచీ ప్రారంభమైంది. తుదకు 27.25 నష్టంతో రూ.1,564 వద్ద ముగిసింది. నిఫ్టీలోనూ 27.34 శాతం కోల్పోయి రూ.1,560 వద్ద నమోదయ్యింది. ప్రారంభ ధరతో పోల్చితే 20 శాతం విలువ నష్టపోయింది. ఒక్క పూటలోనే ఇన్వెస్టర్లు రూ.38 వేల కోట్ల సంపదను పోగొట్టుకున్నట్లయ్యింది. దీంతో ఎంతో ఆశగా పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురైయ్యారు. పేటియం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది.
మిగితా స్టార్టప్‌లకు కంటే అధ్వానం
పేటియం ఐపిఒకు వచ్చిన కాలంలోనే నైకా కూడా మార్కెట్లోకి వచ్చింది. కాగా.. మార్కెట్లో నైకాతో పోలిస్తే పేటియం మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2000 కోట్లు తక్కువకు పడిపోవడం గమనార్హం. ఇప్పటివరకు దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు స్టార్టప్ సంస్థలు లిస్టయిన స్టార్టప్‌లతో పోలిస్తే పేటియం అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంది.
పతనం కొనసాగొచ్చు..
పేటియం సూచీ 44 శాతం వరకూ పతనం కావచ్చునని బ్రోకరేజ్ హౌస్ మాక్క్వారీ అంచనా వేసింది. ఈ సూచీ పట్ల రిటైల్ మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఒక్క సారి కూడా లాభాలను ఆర్జించని ఈ సంస్థ ఐపిఒపై చాలా సంస్థలు ముందే హెచ్చరించాయి. ఈ ఫిన్‌టెక్ కంపెనీలో పెట్టుబడులు అధిక రిస్కుతో కూడుకున్నవని ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు ఐపిఒకు ముందే హెచ్చరించారు.
విజయ్ శేఖర్ భావోద్వేగం..
బాంబే స్టాక్ ఎక్సేంజీలో పేటియం లిస్టింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విజరు శేఖర్ శర్మ కుటుంబంతో సహా ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భారత భాగ్య విధాతా అనే పదాలు వినిపించినప్పుడల్లా తన కంట నీరు ఆగవని.. ఈసారి కూడా ఆగడం లేదని కంటతడి పెట్టుకున్నారు.