Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : సాధారణ పౌరులు కాల్చిచంపినట్లుగా వార్తలు వస్తున్న హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌పై జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నెల 15న జరిగిన హైదర్‌పొర ఎన్కౌంటర్లో మరణించిన నలుగురిలో ముగ్గురు సాధారణ పౌరులేనని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను ఆ ప్రదేశం నుంచి పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించిన కొన్ని గంటల తరువాత ఎల్జి ఈ విచారణకు ఆదేశించారు. 'హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌పై ఎడిఎం (అదనపు జిల్లా మేజిస్ట్రేట్) ర్యాంక్ అధికారిచే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నాం. గడువులోగా నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అమాయక పౌరుల జీవితాలను రక్షించే నిబద్ధతకు జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పౌరులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తుంది' అని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.కాగా, ఎన్కౌంటర్లో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను ఇవ్వాలని డిమాండ్ చేయడానికి ప్రెస్ ఎన్క్లేవ్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులను, నిరసనకారులను పోలీసులు తమ వాహనాల్లో బలవంతంగా ఎక్కించుకుని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు.
మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించండి : గుప్కార్ డిమాండ్
హైదర్‌పొర ఎన్కౌంటర్లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని గుప్కార్ డిమాండ్ చేసింది. హైదర్‌పొర ఘటన, మృతుల కుటుంబ సభ్యులకు సహాయం చేసే అంశంపై గురువార గుప్కార్ నేతలు సమావేశమయ్యారు. గుప్కార్ కూటమి చైర్మన్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం గుప్కార్ అధికార ప్రతినిధి, సిపిఎం నాయకులు ఎం.వై. తరిగామి మీడియాతో మాట్లాడారు. 'మేం ఏ రాజకీయ ప్రక్రియ కోసం లేదా ఎన్నికలు నిర్వహించడం కోసం సమావేశం కాలేదు. మన ప్రజల ప్రాణాలను రక్షించడమే మనకు కావల్సింది. సామాన్యుల భద్రతకు హామీ ఇచ్చే జీవితాలను, రాజ్యాంగాన్ని, వ్యవస్థను కాపాడేందుకు మేం కలిసి ఉన్నామని జమ్ముకాశ్మీర్ ప్రజలకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం' అని తరిగామి చెప్పారు.'ఇలాంటి ఘటనలు ఆగకపోతే, మృతదేహాలను తిరిగి ఇవ్వకపోతే మేం మా గొంతును పెంచడానికి ప్రతీ తలుపు తడతాం. పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్లో సమస్యను లేవనెత్తుతారు' అని తరిగామి చెప్పారు.