Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలపై ఐరాస ప్రశ్నావళి
- కేంద్రానికి 'ఆహార హక్కు' ప్రత్యేక ప్రతినిధి లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాల్లోని అభ్యంతరకర అంశాలను పేర్కొంటూ పలు ప్రశ్నలను సంధించింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే మానవ హక్కుల మండలిలో భాగంగా ఉండే 'ఆహార హక్కు' ప్రత్యేక ప్రతినిధి మైఖేల్ ఫక్రి తొమ్మిది ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 12న ఒక లేఖ రాశారు. వీటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు. కీలకమైన ఈ లేఖ ప్రతిని సామాజిక మాధ్యమాల్లో ఆయన గురువారం పోస్టు చేశారు.
మైఖేల్ ఫక్రి సంధించిన ప్రశ్నలివే ..
- రైతులు, వ్యవసాయ రంగ నిపుణుల అభ్యంతరాలపై మీ స్పందన ఏమిటి? అదనపు సమాచారం ఏమైనా పొందుపర్చగలరా?
- ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్ 2020 తీసుకురావడం వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్పి) లేదా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు ఉద్దేశించిన ఇతర హామీలకు, హక్కులకు భంగం కలగదన్న భరోసా ఏమిటి? ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలేమిటి?
- కనీస మద్దతు ధరతోనే వ్యవసాయోత్పత్తుల సేకరణ జరుగుతుందని, ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఎపిఎంసి మండీలు (మార్కెట్లు) ఇలాగే కొనసాగుతాయని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇలాంటి మద్దతు ఇక ముందు కూడా ఎలా కొనసాగుతోందో వివరించగలరా?
- జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమల్జేస్తున్న ఆహార సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థలు ఇక ముందు కూడా కొనసాగించడానికి, ఆహార కొరతతో ఉండే ప్రజలకు తిండి గింజలు అందించే ఏర్పాటు కొనసాగించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటీ? ఏ విధంగా భరోసా కల్పించగలదు?
- నిత్యావసరాల సరుకుల (సవరణ) చట్టం 2020 అమలు కారణంగా అక్రమ నిల్వల వల్ల ధరల విషయంలో అక్రమాలకు పాల్పడితే వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? ఒక వేళ అలాంటి ఏర్పాటు లేకపోతే సన్నకారు రైతులకు, వ్యవసాయోత్పత్తుల నిల్వకు సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు మీరు ఇచ్చే భరోసా ఏమిటి?
- నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020 కారణంగా ధరల అక్రమాలకు పాల్పడే సందర్భాల్లో సన్నకారు రైతులకు భరోసాగా మీరు తీసుకోనున్న చర్యలేమిటి?
- ఫార్మర్స్ ప్రొడక్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెలిసిటేషన్) యాక్ట్ 2020 లేదా ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్్ 2020 కింద కాంట్రాక్టు ఉల్లంఘన జరిగే సందర్భంలో రైతులకు న్యాయం, చక్కని పరిష్కారం లభించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది?
- వ్యవసాయ రంగంలో అధిక సంఖ్యలో ఆధారపడి ఉపాధి పొందుతున్న మహిళల హక్కులపై కొత్త వ్యవసాయ చట్టాలు ప్రతికూల ప్రభావం చూపవన్న గ్యారెంటీ ఏమిటీ?
- ఈ చట్టాలను రూపొందించే సందర్భంలో విస్తృత బహిరంగ అభిప్రాయ సేకరణ ద్వారా వీటితో ముడిపడివున్న సంబంధికులందరి అభిప్రాయాలు తీసుకొని వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పులు లేదా సవరణలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది?