Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలోనూ పడకేసిన సేకరణ
- లక్ష్యం 70 లక్షల మెట్రిక్ టన్నులు
- సేకరించింది 4.98 లక్షల మెట్రిక్ టన్నులే
న్యూఢిల్లీ : దేశంలో ధాన్యం పండే రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తిండి గింజలు పంపిణీ చేస్తే అటు పేదలకు, ఇటు రైతులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు పదేపదే సూచిస్తున్నా పాలకులు మాత్రం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైఒకరు మీదంటే మీదే బాధ్యత అంటూ భీష్మీంచుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటోంది. తెలంగాణాలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో కల్లాల్లోని ధాన్యం ఇటీవల కురుస్తున్న వర్షాలకు మొలకలెత్తుతన్న పరిస్థితి నెలకొంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ధాన్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. ధాన్యం సేకరణ లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచింది. రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు కేవలం 4.98 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 4 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా, 1,712 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. రైతులు మండీల చుట్టూ తిరుగుతున్నారు. ధాన్యం సేకరణ కోసం 6,42,224 మంది రైతులు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 71,352 మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరించారు. గత్యంతరం లేక రైతులు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,940 ఉంటే, బయట ప్రైవేట్ వ్యక్తులకు రూ.1,250 అమ్ముకోవాల్సి వస్తుంది. ధాన్యం రైతుల పరిస్థితి ఇలావుంటే కేంద్రం మాత్రం తన మొండివైఖరి వీడటం లేదు. పారా బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయబోమంటూ బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటన ధాన్యం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.