Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సర్కారు మొబైల్ యాప్
- తొలుత ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలీటీలు, 300 గ్రామ పంచాయతీల్లో అమలు
తిరువనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో అకర్బన వ్యర్థాల సేకరణను మెరుగుపర్చడం, ట్రాక్ చేయడం కోసం కేరళ ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకోనున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మొబైల్ అప్లికేషన్ను తీసుకురానున్నది. ఈ స్మార్ట్ గార్బేజ్ మొబైల్ యాప్ను మొదటగా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలు, 300 గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది వ్యర్థాల తొలగింపును మరింత సమర్థవంతంగా చేస్తుందని ఆ రాష్ట్ర మంత్రి ఎం.వీ. గోవిందన్ మాస్టర్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే అకర్బన వ్యర్థాల మొత్తం, వాటి నియంత్రణ గురించి తెలుసుకోవడానికి ఈ యాప్ను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ఇచ్చిన క్యూఆర్ కోడ్ల సహాయంతో.. ఉత్పత్తి అయిన వ్యర్థాల వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. వ్యర్థాల సేకరణను ట్రాక్ చేయడానికి ఈ వ్యవస్థ అన్ని స్థానిక సంస్థలు, విభాగాలకు వీలు కల్పిస్తుందన్నారు. కాగా, రాష్ట్ర పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారత కార్యక్రమం కుటుంబశ్రీ మిషన్ వాలంటీర్ల ద్వారా ఈ పథకం అమలు కానున్నది. హరిత కర్మ సేనగా పిలవబడే వాలంటీర్లకు ఈ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ ఫోన్లను కల్పించనున్నట్టు మంత్రి చెప్పారు. దీనికి కేరళ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారం అందించనున్నదని తెలిపారు.