Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లోని ప్రముఖ బ్రాండ్లు ప్రధాన ప్లాస్టిక్ కాలుష్యకారకాలుగా ఉన్నాయంటూ ఒక నివేదిక తేల్చింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్లయిన పార్లే ఉత్పత్తులు, ఐటీసీ, బ్రిటానియా, హల్దీరామ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మిల్క్ మిస్ట్, యునైటెడ్ స్పిరిట్స్ ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నాయని సర్వేలో తేలింది. 19 రాష్ట్రాల్లో ఏడు పౌర సమాజ సంస్థలు (లాభాపేక్షలేని సంస్థలు, ఎన్జీఓలు) ఈ సర్వేను చేపట్టాయి. అంతర్జాతీయ 'బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్' సంస్థతో సహా ఆరు సంస్థలకు చెందిన వెయ్యిమంది స్వచ్చంధ కార్యకర్తలు ఈ సర్వే నిర్వహించాయి. సర్వేలో భాగంగా ప్రధానంగా గృహాలు, బహిరంగ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ను సేకరించారు.
1,49,985 రకాలను సేకరించగా.. వాటిలో ఆహార పదార్థాల ప్యాకింగ్‌లు ఉండగా.. వీటిలో పాల ప్యాకెట్లవే 25 శాతం ఉన్నట్టు తేలింది. 18 శాతం ప్యాకింగ్ ప్లాస్టిక్ మెటీరియల్, 8 శాతం వ్యక్తిగత సంరక్షణలో, 7 శాతం గృహోపకరణాల కోసం ఒక్క శాతం పొగాకు మెటీరియల్ కోసం వినియోగించినట్టు తేలింది.
యునీలివర్, పెప్సికో, కోకోకోలా, నెస్ట్లే, అమెజాన్ హౌల్ ఫుడ్స్, రెకిట్ బెంకిజర్, కోల్గేట్ పామోలివ్, పీఅండ్‌జీ, క్రాప్ట్ హీంజ్, మోండలేజ్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల్లో టాప్‌టెన్‌గా ఉన్నాయి. ఈ ఆడిట్ చేపట్టడం వరుసగా ఇది నాలుగోసారి. పైన పేర్కొన్న కొన్ని బ్రాండ్లు గతంలో కూడా టాప్ టెన్ స్థానంలో ఉన్నాయి.
వీటిలో 35 శాతం అనేక పొరల (మల్టీ లేయర్) ప్లాస్టిక్‌తో రూపొందించడంతో వాణిజ్యపరంగా రీసైక్లింగ్ చేయలేమని నివేదిక తేల్చింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఇవన్నీ కూడా సింగిల్ యూజ్వేనని తెలిపింది. సాచెట్స్, పాకెట్స్, రేపర్స్ ఇలా భిన్న రకాలుగా మన గహాల్లోకి వస్తున్నాయి. వీటిని సేకరించడం, వేరు చేయడం రెండూ ప్రధాన సమస్యలని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా డిస్పోజబుల్ (వినియోగించడం పారేయడం) సంస్కతి పెరిగిపోయింది. ఈ కేటగిరీకి చెందిన వస్తువులన్నీ అనేక పొరలతో కూడిన ప్లాస్టిక్‌తోనే రూపొందుతుండటం గమనార్హం.
మరో 31 శాతం తక్కువ నాణ్యతతో కూడిన ప్లాస్టిక్ (పాలిథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్), పలుమార్లు రీ సైక్లింగ్ చేసినవి కావడంతో ఇంకా ప్రమాదకరంగా మారాయి. మిల్క్ పాకెట్లు, స్టీల్, ప్లాస్టిక్ డబ్బాలను సీల్ చేసేవి, వాటర్ బాటిల్స్, పైప్స్, వైర్స్ ఇలా రకరకాలుగా మన గృహాల్లోకి చేరుతున్నాయి. అత్యధికంగా రీసైక్లింగ్ చేయబడిన వాటిల్లో ప్రధానంగా వినియోగించేవి బాటిల్స్, షాంపూలు, ఆయిల్స్, డిటర్జెంట్స్, సోడా, సిరప్లు ప్రధానంగా ఉన్నాయి. నివేదిక ప్రకారం.. వీటిని పదేపదే రీసైక్లింగ్ చేయడంతో పర్యావరణంలోకి విషవాయువులను ఉత్పత్తి చేయడంతో కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.