Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్ర ఉద్యమం, మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మహాత్ముడి ముని మనవడు తుషార్ గాంధీ ధీటుగా బదులిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంతోపాటు.. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలంటూ మహాత్మా గాంధీ ప్రవచించిన సూత్రాన్ని ఎద్దేవా చేస్తూ ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'గాంధేయవాదులు మరో చెంప మాత్రమే చూపిస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, అలా రెండో చెంప చూపించాలంటే ఎంత ధైర్యం అవసరమో ఆ పిరికి వ్యక్తులకు అర్థం కాదు. వారు ఆ వీరత్వాన్ని అర్థం చేసుకోలేని అసమర్థులు. ఆనాటి భారతీయులు అలాంటి ధైర్యాన్ని సమృద్ధిగా ప్రదర్శించారు. వారంతా హీరోలు. తన దేశం, ప్రజల కోసం ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. అర్ధ నగ ఫకీరు అంటూ బ్రిటీష్ ప్రధాని కొట్టిపారేసినా.. చివరకు ఆ దేశం గాంధీ ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది. అబద్ధాలను ఎంత బిగ్గరగా అరిచి చెప్పినా.. నిజం నిలకడగా ఉంటుంది. అయితే, ఈ అబద్ధాలపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది' అని తుషార్ తెలిపారు. 1947లో కాదు.. 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ కొద్ది రోజుల క్రితం కంగన వివాదాలకు తెరలేపారు. దీంతో ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి వంటి అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అవమానించడమేనంటూ ఆమె వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.