Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వ మాజీ అధికారుల పిటిషన్
- ఉపా చట్టం అమలుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)లోని పలు నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ.. పలువురు మాజీ ఆలిండియా సర్వీసెస్ అధికారులు (మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు) దాఖలు చేసిన రిట్పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఉపాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బదులివ్వాలని కేంద్రన్ని ఆదేశించింది. ఉపాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో హర్ష్ మందిర్ , వజత్ హబీబుల్లా, అమితాబ్ పాండే, కమల్ కాంత్ జైశ్వాల్, ప్రదీప్ కుమార్దేవ్ వంటి ప్రముఖ మాజీ అధికారులు ఉన్నారు. అసమ్మతివాదులను అణచివేయడానికి ఉపా చట్టాన్ని వాడుతున్నారని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులనే ఆరోపణలతో అరెస్టయిన వ్యక్తుల హక్కులకు రక్షణ లేకుండాపోతున్నదని వెల్లడించారు. అలాగే చట్టంలోని సెక్షన్ 45 కింద చర్యలు తీసుకుంటున్న తీరును, సెక్షన్ 43(డి)5 కింద బెయిల్ మంజూరుపై విధించిన ఆంక్షలను పిటిషన్ ప్రశ్నించింది. ఉపా కింద అరెస్టు చేసినవారిని నేరస్తులుగా నిరూపించే విషయంలో అధిక కేసుల్లో ప్రాసిక్యూష న్ విఫలమైందని పేర్కొంది. ఇష్టారాజ్యంగా ఉపాను ప్రయోగించ డాన్ని ఆపాలని, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని పిటిషనర్లు న్యాయస్థా నాన్ని కోరారు. ఉపాలోని పలు ఆంక్షలు ఆర్టికల్ 21 (స్వేచ్ఛ హక్కు)కు విరుద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చట్టం కింద ప్రాసిక్యూషన్ రేటు ప్రస్తావిస్తూ.. అత్యల్పంగా ఉందనీ, పౌరులు చాలా కాలం పాటు అన్యాయంగా నిర్బంధంలో ఉండటంతో పాటు కొంతమంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను సైతం పిటిషన్లో ప్రస్తావించారు.ఇదిలావుండగా, చాలా కాలంగా ఉపా చట్టంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల త్రిపురలో చోటుచేసుకున్న హింసను నివేదించిన జర్నలిస్టులు, నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మొత్తం 102 మందిపై ఉపా కింద కేసులు నమోదుచేశారు. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. అక్టోబర్లో పాక్-భారత్ మ్యాచ్ నేపథ్యంలో రెండు మెడికల్ కాలేజీ విద్యార్థులపై ఉపా కింద అభియోగాలు మోపబడ్డాయి. 2018లో పూణే సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న హింసకు కుట్రపన్నారనే ఆరోపణలతో 14 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు మహారాష్ట్రలోని జైల్లోలో నిర్భందంలో ఉన్నారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్స్వామికి ఆరోగ్యం బాగులేకపోయిన బెయిల్ లభించకపోవడంతో ఈ ఏడాది జులైలో కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, తీవ్ర అనారోగ్యానికి గురైన తర్వాత విరసం నేత వరవరరావుకు వైద్య కారణాలతో బెయిల్ మంజూరైంది. ఉపా కేసు ఆరోపణలు మోపబడిన వారిలో దోషులుగా తేలింది చాలా తక్కువ మంది ఉన్నారని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.