Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టు తీర్పు
- బాంబే హైకోర్టు తీర్పు కొట్టివేత
న్యూఢిల్లీ : బాలిక శరీరాన్ని నేరుగా కాకుండా దుస్తుల పైనుంచి ఎలా తాకినా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ''లైంగిక వేధింపుల నేరాన్ని గుర్తించడంలో అతి ముఖ్యమైన అంశం లైంగిక ఉద్దేశమే. అంతేకానీ బాలిక శరీరాన్ని నేరుగా తాకారా లేదా అనేది కాదు. నిబంధనలు నాశనం చేయడం కన్నా చట్టసభ ఉద్దేశం అమలులోకి రాకపోతే వివరణ ఇవ్వాల్సి వస్తుంది'' అని పేర్కొంది. దుస్తులపై నుంచి బాలిక శరీరాన్ని తాకడం లైంగిక వేధింపులుగా భావించరాదని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, జాతీయ మహిళ కమిషన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పోక్సో చట్టం అమలు చేయడానికి శరీరాన్ని నేరుగా తాకడం (స్కిన్ టు స్కిన్) తప్పనిసరి అనడం అసంబద్ధమైన వ్యాఖ్యానమని స్పష్టం చేసింది. ''చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు నిబంధనలపై న్యాయస్థానాలు గందరగోళం సృష్టించకూడదు.
సందిగ్ధతను సృష్టించడంలోనూ న్యాయస్థానాలు అత్యుత్సాహం చూపడం సరికాదు. ఇక్కడ పోక్సో చట్టం లక్ష్యం చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడమే. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో బాలికను ఎలా తాకినా అది నేరమే. అంతేగానీ నేరాన్ని పరిగణించే సమయంలో నిందితుడు శరీరభాగాన్ని నేరుగా తాకాడా లేదా దుస్తులపై నుంచి తాకారా అన్నది అనవసరం'' అని ధర్మాసనం పేర్కొంది. నిందితుడు దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
కేసు నేపథ్యం
2016లో 12 ఏండ్ల బాలికకు జామకాయ ఆశ చూపి 39 ఏండ్ల వ్యక్తి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో బాలిక ఛాతీని తాకి దుస్తులు విప్పడానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెషన్స్ కోర్టు నిందితుడికి పోక్సో చట్టం కింద మూడేండ్లు జైలు శిక్ష విధించింది. అనంతరం నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ పుష్ప గనేడివాలా ఈ ఏడాది జనవరిలో తీర్పు ఇచ్చారు. బాలిక శరీరాన్ని దుస్తులపై నుంచి తాకడం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పేర్కొనలేమనీ, దుస్తులు తొలగించడం, దుస్తుల లోపల చేయి పెట్టి నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక వేధింపుల్లోకి వస్తుందని జస్టిస్ పుష్ప పేర్కొన్నారు. ఈ ఆదేశాలు నిలిపి వేయాలని అటార్నీ జనరల్, జాతీయ మహిళ కమిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా జనవరి 27న బాంబే హైకోర్టు తీర్పు అమలు నిలిపివేసింది. తాజాగా ఆ తీర్పును కొట్టివేసింది.