Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో 70.6 శాతానికి పెరుగుదల
- విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో కేరళ టాప్ : ఏఎస్ఈఆర్ నివేదిక
న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల నమోదులో పెరుగుదల ఉన్నదని 'వార్షిక విద్యా స్థితి' నివేదిక (ఏఎస్ఈఆర్) వెల్లడించింది. ఇది 2018లో 64.3 శాతంగా నుంచి 2021లో 70.3 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యా పరిస్థితిపై ఏఎస్ఈఆర్ సర్వేను 'ప్రథమ్ ఎన్జీవో నిర్వహించింది. ఈ ఏఎస్ఈఆర్ (గ్రామీణ) నివేదిక-2021 ఇటీవల విడుదల చేసింది. 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 581జిల్లాల్లో సర్వే నిర్వహించారు. 17,184 గ్రామాల్లోని 76,706 కుటుంబాల్లో సర్వే నిర్వహించారు. 7,299 స్కూల్స్లో 75,234 మంది5నుంచి 16ఏళ్ల చిన్నారులను సర్వేలో కవర్ చేశారు.తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లోని 270 గ్రామాల్లో 1,631 కుటుంబాలను సర్వే చేశారు. 1,115 మంది చిన్నారులను సర్వే చేయగా అందులో 1-2 తరగతుల విద్యార్థులు 191 మంది, 3-5 తరగతుల విద్యార్థులు 274 మంది, 6-7 తరగతుల విద్యార్థులు 281 మంది, 8-10 తరగతుల విద్యార్థులు 195 మంది ఉన్నారు.ఏపీలో 13 జిల్లాల్లో 390 గ్రామాల్లో 2,367 కుటుంబాలను సర్వే చేశారు.1,507 మంది చిన్నారులను సర్వే చేయగా అందులో 1-2 తరగతుల విద్యార్థులు 223 మంది, 3-5 తరగతుల విద్యార్థులు 375 మంది, 6-7 తరగతుల విద్యార్థులు 421 మంది, 8-10 తరగతుల విద్యార్థులు 304 మంది ఉన్నారు.
తెలంగాణలో జాతీయ సగటు కంటే తక్కువ
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నది. తెలంగాణలో 2018లో 56.4 శాతం (60.2 శాతం బాలికలు, 52.6 శాతం బాలురు) మంది ప్రభుత్వ పాఠశాల్లో చేరారు. 2020 నాటికి ప్రభుత్వ పాఠశాల్లో చేరిన వారి సంఖ్య 54.8 శాతానికి (58.7 శాతం బాలికలు, 51.4 శాతం బాలురు చేరారు) పడిపోయింది. 2021లో మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారి సంఖ్య పెరిగింది. 2021లో తెలంగాణలో 60 శాతం (62.9 శాతం బాలికలు, 57.6 శాతం బాలురు) మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరారు. అయితే, జాతీయ గణాంకాల విషయానికొస్తే 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 64.3 శాతం నుంచి 2021లో 70.3 శాతానికి పెరగడం గమనిచాల్సిన అంశం.
ఏపీలో పెరిగిన విద్యార్థుల నమోదు
ఏపీలో ప్రభుత్వ పాఠశాల్లో చేరిన వారి సంఖ్య ఏటికేడూ పెరుగుతున్నది. జాతీయ సగటు కంటే ఏపీలో పెరుగుదల ఎక్కువ ఉండటం గమనార్హం. ఏపీలో 2018లో 62.2 శాతం (65.1 శాతం బాలికలు, 59 శాతం బాలురు) విద్యార్థులు చేరగా, 2020 నాటికి అది కాస్తా 66.9 శాతానికి (69.5 శాతం బాలికలు, 64.4 శాతం బాలురు) పెరిగింది. 2021లో 70.6 శాతం (బాలికలు 77.2శాతం, 63.7 శాతం బాలురు) మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరారు.
దేశవ్యాప్తంగా 70.3 శాతానికి పెరుగుదల
దేశవ్యాప్తంగా 2018లో 64.3 శాతం (68 శాతం బాలికలు, 60.7 శాతం బాలురు) మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరారు. 2020లో 65.8 శాతం (69.4శాతం బాలికలు, 62.6శాతం బాలురు) మంది ప్రభుత్వ పాఠశాల్లో చేరగా,2021లో అది 70.3శాతానికి (73శాతం బాలికలు, 67.9 శాతం బాలురు) పెరిగింది.2018 (64.3 శాతం)లో కంటే 2021 (70.3 శాతం)ల్లో ప్రభుత్వ పాఠశాల్లో చేరిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఆరు శాతం పెరిగింది. ఇలా ప్రభుత్వ పాఠశాల్లో చేరిన వారి సంఖ్యలో పెరుగుదల నమోదైన మొదటి ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (13.2 శాతం), కేరళ (11.9 శాతం), తమిళనాడు (9.6 శాతం), రాజస్థాన్ (9.4 శాతం), మహారాష్ట్ర (9.2 శాతం), ఆంధ్రప్రదేశ్ (8.4 శాతం) లు ఉన్నాయి. ఆ ఐదు రాష్ట్రాలతో పాటు కర్ణాటక (8.3 శాతం), పంజాబ్ (6.8 శాతం), హర్యానా (6.6 శాతం) రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో పెరుగుదల జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ట్యూషన్ తీసుకుంటున్న విద్యార్థులు
ట్యూషన్ తీసుకుంటున్న విద్యార్థుల శాతమూ ప్రతి ఏడాదీ పెరుగుతున్నది. 2018లో 28.6 శాతం (29.6 శాతం ప్రభుత్వ, 26.7 శాతం ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు) మంది విద్యార్థులు, 2020లో 32.5 శాతం (33 శాతం ప్రభుత్వ, 31.2 శాతం ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు) మంది విద్యార్థులు, 2021లో 39.2 శాతం (39.5 శాతం ప్రభుత్వ, 38.2 శాతం ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు) మంది విద్యార్థులు ట్యూషన్ తీసుకుంటున్నారు. అమ్మాయిలు కంటే అబ్బాయిలే ఎక్కువ మంది ట్యూషన్ తీసుకోవడం గమనార్హం. 2018లో 30 శాతం మంది బాలురు, 27.2 శాతం మంది బాలికలు ట్యూషన్ తీసుకోగా, 2020లో 33.6 శాతం బాలురు, 31.2 శాతం మంది బాలికలు ట్యూషన్ తీసుకున్నారు. 2021లో ట్యూషన్ తీసుకుంటున్న బాలురు 40.3 శాతం మంది కాగా, బాలికలు 37.9 శాతంగా ఉన్నారు.
తెలంగాణలో 9.6 శాతానికి పెరుగుదల
తెలంగాణలో 2018లో 5.9 శాతం విద్యార్థులు ట్యూషన్ తీసుకోగా, 2020లో అది 5.3 శాతానికి తగ్గింది. 2021లో ట్యూషన్ తీసుకున్న వారి సంఖ్య 9.6 శాతానికి పెరిగింది. ఏపీలో 2018లో 14.7 శాతం విద్యార్థులు ట్యూషన్ తీసుకోగా2020 నాటికి14.1శాతానికి తగ్గింది.2021లో ట్యూషన్ తీసుకున్నవారి సంఖ్య 22.9 శాతానికి పెరిగింది.కేరళ, పశ్చిమ బెంగాల్, మేఘాలయా, తమిళనా డు, పంజాబ్ రాష్ట్రాల్లో ట్యూషన్ తీసుకున్న విద్యార్థుల శాతం తక్కువగా ఉన్నది.
విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ల విషయంలో కేరళ టాప్
దేశంలో స్మార్ట్ ఫోన్లు ఉన్నవారి శాతం పెరిగింది. కానీ పిల్లల యాక్సెస్ సమస్యగానే ఉన్నది. 2018లో 36.5 శాతం (29.6 శాతం ప్రభుత్వ, 49.9 శాతం ప్రయివేటు పాఠశాలలు) మంది విద్యార్థుల ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2020లో 61.8 శాతం మంది విద్యార్థులకు తమ ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండగా, 2021 నాటికి ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న వారి శాతం 67.6కి (63.7 శాతం ప్రభుత్వ, 79 శాతం ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు) పెరిగింది. కేరళలో అత్యధికంగా విద్యార్థులకు తమ ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కేరళలో 2018లో 80.9 శాతం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండగా, 2020 నాటికి అది కాస్తా 94.3 శాతానికి, 2021 నాటికి అది 97. 5 శాతానికి పెరిగింది. కాగా, ఈ విషయంలో చివరి స్థానాల్లో బీహార్ (54.4 శాతం), ఉత్తరప్రదేశ్ (58.9 శాతం), పశ్చిమ బెంగాల్ (58.4 శాతం) నిలిచాయి.
తెలంగాణలో 79.3 శాతం మంది వద్ద..
తెలంగాణలో 2018లో 45.8 శాతం విద్యార్థులకు తమ ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2020 నాటికి అది కాస్తా 74 శాతానికి, 2021 నాటికి 79.3 శాతానికి పెరిగింది. ఇక ఏపీలో 2018లో 42.1 శాతం మంది విద్యార్థులకు తమ ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 2020 నాటికి అది 61.5 శాతానికి, 2021 నాటికి 72.3 శాతానికి పెరిగింది.
స్మార్ట్ఫోన్లు ఉన్నా.. వినియోగించనివారు 26 శాతం మంది
ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ 26.1 శాతం మంది విద్యార్థులు చదువుకునేందుకు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. బీహార్ 53.8 శాతం, పశ్చిమ బెంగాల్ 46.5 శాతం, జార?ండ్ 39.7 శాతం, ఉత్తరప్రదేశ్ 34.3 శాతం, రాజస్థాన్ 33.4 శాతం, ఛత్తీస్గఢ్ 33.1 శాతం, మేఘాలయ 30.7 శాతం మంది విద్యార్థులు చదువుకునేందుకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోలేకపోతున్నారు. తెలంగాణలో 23.9 శాతం, ఆంధ్రప్రదేశ్లో 18.6 శాతం మంది విద్యార్థుల ఇండ్ల వద్ద స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నప్పటికీ, వారు యాక్సస్ చేయలేకపోతున్నారు.
కుటుంబసభ్యుల సహకారం
తెలంగాణలో 60.7 శాతం మంది విద్యార్థులు కుటుంబ సభ్యుల సహకారం పొందగా, అందులో 59.4 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ, 63.8 శాతం విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలకు చెందినవారు. ఏపీలో ఇండ్ల వద్ద చదువుతున్న 62 శాతం పిల్లలు తమ కుటుంబ సభ్యులు సహకారం పొందుతున్నారు. అందులో 57.3 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 76.1 శాతం మంది ప్రయివేటు పాఠశాలల విద్యార్థులున్నారు. దేశవ్యాప్తంగా 66.6 శాతం మంది విద్యార్థులు కుటుంబ సభ్యుల సహకారం పొందగా, అందులో 64.8 శాతం విద్యార్థులు ప్రభుత్వ, 71.9 శాతం విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలకు చెందిన వారు.
పాఠ్యపుస్తకాల కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు
దేశంలో 91.9 శాతం మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం నమోదు చేసుకున్నారు. అయితే 2020లో 80.5 శాతం మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం నమోదు చేసుకున్నారు. తెలంగాణలో 2020లో 68.1 శాతం (89.3 శాతం ప్రభుత్వ, 37.1 శాతం ప్రయివేటు పాఠశాలల) విద్యార్థులు, 2021లో 93.2 శాతం (95.6 శాతం ప్రభుత్వ, 87.6 శాతం ప్రయివేటు పాఠశాలల) విద్యార్థులు పాఠ్యపుస్తకాలు కోసం నమోదు చేసుకున్నారు. ఏపీలో 2020లో కేవలం 34.6 శాతం మంది (38.5 శాతం ప్రభుత్వ, 24.7 శాతం ప్రయివేటు పాఠశాలల) 2021లో 96.3 శాతం (97.5 శాతం ప్రభుత్వ, 92.7 శాతం ప్రయివేటు పాఠశాలల) విద్యార్థులు పాఠ్య పుస్తకాలు కోసం నమోదు చేసుకున్నారు.