Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ సుమారు ఏడాది నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని చేపట్టిన అన్నదాతల విజయంగా భావించవచ్చు. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలిన నేపథ్యంలో... వచ్చే ఏడాది జరగబోయే ఐదు అసెంబ్లీ ఎన్నికలు... ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన వెలువడినట్టు ఇట్టే స్పష్టమవుతున్నది.
ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు
ఉత్తరప్రదేశ్‌లో కీలక ప్రాంతం పశ్చిమ యూపీ. మొత్తం 403 స్థానాలకు గానూ ఇక్కడ 130 సీట్లు ఉన్నాయి. ఇక్కడ యోగి సర్కార్ గెలవడం ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాలు ఉపసంహరణకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు 'హిందూ'తో మాట్లాడుతూ.. ఈ మూడు చట్టాల్లో పేర్కొన్న అంశాలు ఈ ప్రాంతంలోని రైతులను ప్రభావితం చేయనప్పటికీ... వ్యవసాయంపై తక్కువ రాబడి.. విద్యుత్ బిల్లుల పరంగా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన చెరకు సేకరణ ధర పెంచినప్పటికీ... డిమాండ్ చేసిన దాని కన్నా హెక్టారుకు రూ.10 తక్కువగా ఇవ్వడం, అదేవిధంగా లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటన కూడా ప్రతికూల ప్రభావం చూపిందని స్వయంగా సీనియర్ కేంద్ర మంత్రి అంగీకరించడం గమనార్హం. ఒకవేళ రైతు సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి పుంజుకునేది. అది బీజేపీకి గట్టి దెబ్బలాంటిదేనని అన్నారు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించి.. ఈ ప్రాంతంలో పార్టీకి చెందిన బూత్ ఇన్‌చార్జ్‌లతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
పంజాబ్ ఎన్నికలు
వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాక... కూటమి భాగస్వామి అయిన అకాలీదళ్‌తో చెడిన తర్వాత... పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే అక్కడ హిందూ మత వర్గాల్లోనూ, పట్టణ ప్రజలకు తమపై ఎంతో కొంత విశ్వాసం ఉందని భావించిన బీజేపీ నేతలు... రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్లాలంటే జంకుతున్నారు. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటుచేస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను తమకు అనుకూలంగా వినియోగించుకోవడంలో విఫలమైనట్టు కమల దళం గుర్తించింది. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా... రైతుల సమస్య పరిష్కారమయినప్పుడే ప్రజలు స్వాగతించగలరని గ్రహించిన పార్టీలు బీజేపీతో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
భద్రతా ఆందోళనలు..!
కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న రైతుల నిరసనలతో కేంద్రం గుర్రుగా ఉండటమే కాకుండా ఓ రకమైన ఆందోళన కూడా నెలకొంది. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ నిరసనల్లో ఖలిస్తాన్ అంశాలు చొచ్చుకు పోయి.. ప్రాథమిక డిమాండ్లను మతపరంగా వినియోగిం చుకుంటున్నారనీ, దీనివల్ల భద్రతా వ్యవస్థకు తీవ్ర ముప్పు ఏర్పడవచ్చునని మోడీ సర్కార్ భావిస్తోంది. దేశానికి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న పంజాబ్ నిరసనల్లో ఖలిస్తాన్ అంశాలు చొచ్చుకుపోయే అవకాశాలున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవ్వడంతోనే ఈ చట్టాలను రద్దు చేసుకున్నట్టు కేంద్రంలోని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
రెండవ పతనం
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని మరో అంశంతో ముడిపెట్టి చూడాల్సి వస్తుంది. కొన్ని అందోళనల తర్వాత 2015లో భూసేకరణ ఆర్డినెస్స్ను రద్దు చేయడంతో పోల్చుతున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ లబ్ది కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తూ, రాజకీయంగా, ఎన్నికల పరంగా, తన విధానాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. 2016లో నోట్ల రద్దు, 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వంటి అనేక ఏకపక్ష నిర్ణయాల తర్వాత... వీటిపై కొంత వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో... మోడీ సర్కార్ ఆలోచనలో పడింది. 2017లో గుజరాత్ ఎన్నికలకు ముందు వస్తు సేవల పన్ను రేట్లలో మార్పులు చేయడంతో... సూరత్‌లోని వ్యాపారుల ఆగ్రహానికి లోనుకావాల్సి వచ్చింది. 2015లో భూసేకరణ ఆర్డినెస్స్పై ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత బీజేపీ పాలిత ముఖ్యమంత్రి ఒకరు ఓ పురాణ గాథను చెప్పారు. పాండవులు, కౌరవుల మధ్య నెలకొన్న వైరం తర్వాత... పాండవులు ఏడాది పాటు అజ్ఞాత వాసం చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో విరాట రాజు కుటుంబానికి సేవ చేశారనీ, పూర్తిగా రాజరికాన్ని వదిలేశారనీ, ఎందుకంటే రాజ్యాన్ని తిరిగి పొందటానికి చేసిన ఓ వ్యూహాత్మక తిరోగమని అన్నారు. అంటే అధికారం కోసం కొన్నిసార్లు తలవంచక తప్పదన్న సామెతను గుర్తు చేశారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారనున్న యూపీ, పంజాబ్ ఎన్నికలు.. దాని ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలున్నందున ఈ సూత్రాలను బీజేపీ అమలు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.